గురువారం 02 జూలై 2020
National - Jun 01, 2020 , 01:52:44

ఇకపై మరింత జాగ్రత్త అవసరం

ఇకపై మరింత జాగ్రత్త అవసరం

  • మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
  • నిబంధనలు పాటించాల్సిందే కరోనాపై పోరాటాన్ని
  • బలహీనం చేయవద్దు పేదలు, కూలీల బాధలు వర్ణనాతీతం 

న్యూఢిల్లీ, మే 31: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా ప్రబలకుండా మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా నిరోధంలో ప్రజలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా తన మనసులోని మాటలను దేశప్రజలతో పంచుకొన్నారు. అందరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని సూచించారు. కరోనాపై పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపర్చవద్దని కోరారు. కరోనా కారణంగా నిరుపేదలు, కూలీలు పడ్డ బాధలను మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. వారిని ఆదుకోవడానికి ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామీణ, స్వయం ఉపాధికి అవకాశాలను మెరుగుపరుస్తుందని, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి దోహపడుతుందని చెప్పారు.

వలసకూలీల తరలింపులో రైల్వేశాఖ సేవలు మరువలేనివని మోదీ ఈ సందర్భంగా అన్నారు. వారి కోసం మైగ్రేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. కరోనా వైరస్‌ శ్వాసవ్యవస్థను దెబ్బతీస్తుందని, యోగా ద్వారా శ్వాసకోశ వ్యాధులను అధిగమించవచ్చని తెలిపారు. హాలీవుడ్‌ నుంచి హరిద్వార్‌ దాకా ప్రతి ఒక్కరూ యోగా గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. కరోనా గురించి ఇతర దేశాల నాయకులతో చర్చిస్తున్న సమయంలో వారు కూడా యోగా గురించి అడుగుతున్నారని చెప్పారు. నిరుపేదలకు ఆయుష్మాన్‌ భారత్‌ వరంగా మారిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు కోటి మందికి పైగా చికిత్స పొందారని చెప్పారు. మిడతలను నిరోధించడానికి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా ఎన్నో ఆవిష్కరణలకు దారితీసిందని,  స్వయం స్వావలంబన స్పృహను కలిగించిందని చెప్పారు. ప్రజలు స్థానిక వస్తువులను కొనడానికి మొగ్గుచూపుతన్నారని తెలిపారు. మాస్కుల తయారీలో మహిళలు, స్వయంసహాయక సంఘాలు చూపిన చొరవ అభినందనీయమన్నారు.

ఇద్దరికి ప్రత్యేక అభినందనలు


మన్‌ కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మోదీ ఇద్దరు వ్యక్తులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సేవాతత్పరతకు వారు ఉదాహరణలని పేర్కొన్నారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన రాజు అనే యాచకుడు(దివ్యాంగుడు)  భిక్షమెత్తి రూ. 75 వేలు సేకరించాడు. వాటితో మాస్కులు, బియ్యాన్ని కొని అవరసరమైన వారికి పంపిణీ చేశాడు. త్రిపురలో తోపుడు బండిని లాగే 51 ఏండ్ల గౌతమ్‌దాస్‌ తను దాచుకున్న రూ.10 వేలతో నిత్యావసరాలు కొని అన్నార్తులకు పంచాడు. ఈ ఇద్దరిని మోదీ ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. కృతజ్ఞతలు తెలిపారు. logo