శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 26, 2020 , 16:03:14

లేహ్‌లో కమలం హవా.. బీజేపీ 15, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలుపు

లేహ్‌లో కమలం హవా.. బీజేపీ 15, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలుపు

లేహ్‌: లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డీసీ) లెహ్ జనరల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ తన హవాను నిలబెట్టుకున్నది. సాయంత్రం  వరకు పూర్తి ఫలితాలు వెలువడగా.. బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. 9 సీట్లలో కాంగ్రెస్‌, 2 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. అక్టోబర్‌ 22 న జరిగిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. 

ఇప్పటివరకు - తుర్తుక్, హుండార్, డిస్కిట్, టెగర్, పనామిక్, టాంగ్ట్సే, కోర్జోక్, మార్ట్సెలాంగ్, కుంగ్యం, తిక్సే, స్కూ మార్కా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా.. చుషుల్ నియోజకవర్గాన్ని కొంచోక్ స్టాన్జిన్ (ఇండిపెండెంట్), న్యోమాను ఇషే స్పాల్జాంగ్ (ఇండిపెండెంట్) గెలుచుకున్నారు. సాక్తీ, ఇగూ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు వరుసగా 20, 79 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. ప్రతి రౌండ్లో ఏడు ప్రాదేశిక నియోజకవర్గాల ఓట్లు లెక్కించారు. 2019 లో ఈ ప్రాంతానికి కేంద్రపాలిత హోదా ఇచ్చిన తరువాత ఇదే మొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు కావడం విశేషం. లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, లేహ్ ఎన్నికలకు పోలింగ్ అక్టోబర్ 13, 14 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. అక్టోబర్ 22 న లేహ్ జిల్లా వ్యాప్తంగా 26 నియోజకవర్గాల్లో 294 పోలింగ్ బూత్‌లలో తుది పోలింగ్ జరిగింది. మొత్తం 54,257 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరే కాకుండా 2,538 పోస్టల్ బ్యాలెట్లు, 1,635 ఈడీసీ ఓట్లు కూడా ఈ రోజు లెక్కించారు. మొత్తం 26 ప్రాదేశిక నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డాయి. లడఖ్ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ 19 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 23 మంది స్వతంత్రులు కూడా రంగంలో నిలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.