మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 14, 2020 , 17:26:29

భార‌త్‌లో ల్యాప్‌టాప్‌ల కొర‌త‌.. కార‌ణం ఇదే!

భార‌త్‌లో ల్యాప్‌టాప్‌ల కొర‌త‌.. కార‌ణం ఇదే!

న్యూ ఢిల్లీ : వర్క్-ఫ్రమ్-హోమ్, ఆన్‌లైన్ తరగతుల దృష్ట్యా భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల కొరత ఏర్ప‌డింది. ఢిల్లీలోని వివిధ ల్యాప్‌టాప్ మార్కెట్ డీలర్ల ప్రకారం.. గత 3-4 నెలల్లో మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయ‌ని, డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్ప‌త్తి వేగంగా జ‌రుగ‌డం లేద‌ని తెలిసింది. అంతేకాకుండా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ విడిభాగాలు ఓడ‌రేవుల్లో నిలిచిపోయాయి. భార‌త్-చైనా మ‌ధ్య జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల వీటి ఎగుమ‌తి ఆల‌స్యం అవుతుంది. వెర‌సి ల్యాప్‌టాప్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల‌కు గుర‌వుతోంది.  

ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఓ ల్యాప్‌టాప్ రిటైలర్ మాట్లాడుతూ “వివిధ తయారీ సంస్థల నుంచి ల్యాప్‌టాప్‌ల సరఫరా కోసం మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. హార్డ్‌వేర్ ఎగుమతులు ఆలస్యం అవుతున్నాయని ప్రతినిధులు ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకంటే వాటిల్లో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.” అని అన్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, రిటైల్ మార్కెట్లలో లభించే ల్యాప్‌టాప్ మోడళ్లు భిన్నంగా ఉంటాయని, అనేక కార్పొరేట్ కార్యాలయాలు తమ ల్యాప్‌టాప్ సరుకుల కోసం రెండు వారాల పాటు వేచి ఉన్నాయని ఆయ‌న తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో ల‌భించే హై ఎండ్ మోడ‌ల్ ల్యాప్‌టాప్‌లు రూ.40వేలు, అంతకంటే ఎక్కువ ధర క‌లిగి ఉన్నాయి. మోడళ్లను విక్రయిస్తున్న ల్యాప్‌టాప్ కంపెనీ వెబ్‌సైట్‌లు కూడా హై-ఎండ్ మోడళ్లను డిస్కౌంట్‌తో అమ్మకాలపై ఉంచాయి.

ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి మంజారి చతుర్వేది.. ఇటీవల ల్యాప్‌టాప్ కొనేటప్పుడు తాను మోసపోయినట్లు తెలిపింది. లోయర్-ఎండ్ మోడళ్లన్నీ ఉద్దేశపూర్వకంగా ప్రధాన బ్రాండ్ల నుంచి అందుబాటులో లేకుండా చేశార‌ని ఆమె తెలిపింది. వినియోగదారుల‌ను హై ఎండ్ మోడ‌ళ్ల‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయా బ్రాండ్ల ప్ర‌తినిధులు బ‌ల‌వంతం చేశారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి నిబంధనలను రూపొందించాలని ఆమె ప్రధానిని సోష‌ల్ మీడియా ద్వారా కోరారు.

ప్ర‌స్తుతం భారత్‌లో ప్ర‌తి ఇంట్లో ఇక‌టి లేదా రెండు ల్యాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు ఉంటున్నాయి. ఇది త‌ల్లిదండ్రులు, విద్యార్థుల వినియోగాన్నిబ‌ట్టి ఉంటుంది. గుర్గావ్ నివాసి రోషన్ సింగ్ ఇటీవల ఒక హై ఎండ్ మోడ‌ల్‌కు రూ.5వేల అధిక ధ‌ర వెచ్చించి కొనాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. 'నేను ఆ మోడల్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసినప్పుడు ధర రూ.40,000 ఉంది. అయితే అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపించ‌డంతో  లోక‌ల్ డీల‌ర్ నుంచి అదే ల్యాప్‌టాప్‌ను రూ.45,000కు కొనాల్సి వ‌చ్చింది. నా కొడుకు తన ఇంజనీరింగ్ తరగతులకు ఆ ల్యాప్‌టాప్ నిర్దిష్ట మోడల్ అవసరం కాబట్టి.. ఎక్కువ చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం లేద‌'ని రోష‌న్ సింగ్ తెలిపాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo