బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 18:55:05

నా కొడుక్కోసమే సైకిల్‌ ఎత్తుకెళ్లా..

నా కొడుక్కోసమే సైకిల్‌ ఎత్తుకెళ్లా..

జైపూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. వేలల్లో జనం చనిపోతుండగా.. లెక్కలేనంత మంది ఈ వైరస్‌ బారిన పడి దవాఖానల పాలవుతున్నారు. ఇక వలసకార్మికుల కష్టాలు చెప్పనలవికావు. గుండెలు పిండేసే వార్తలు, ఫొటోలు కనిపిస్తూ మన మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సొంతింటికి పోయి కలో గంజో తాగి కుటుంబంతో గడుపాలని కోరుకొంటున్న ఎందరో వలసకార్మికులు.. నడుస్తూ, రైలు పట్టాల వెంట పరిగెడుతూ, లారీలపై ఎక్కి సొంతూళ్లకు చేరేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఓ తండ్రి తన అవిటి కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు దొంగగా మారాడు. తనను క్షమించాలంటూ ఓ లేఖను కూడా వదిలివెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన వలస కార్మికుడు మహమ్మద్‌ ఇక్బాల్‌ఖాన్‌ రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి సొంతూరుకు పోవాలని తలచాడు. తన అవిటి కుమారుడిని తీసుకెళ్లేందుకు ఉదయాన్నే భరత్‌పూర్‌ సహాన్‌వలి గ్రామానికి చెందిన సాహిబ్‌సింగ్‌ ఇంటి బయట ఉంచిన సైకిల్‌ను ఎత్తుకెళ్లాడు. వెళ్తూవెళ్తూ తనను క్షమించాలని కోరుతూ సైకిల్‌ యజమానికి లేఖ కూడా రాశాడు. తన అవిటి కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు సైకిల్‌ను దొంగతనం చేయడం కన్నా మరో మార్గంలేనందున మీ సైకిల్‌ ఎత్తుకెళ్తున్నా.. అని లేఖలో పేర్కొన్నాడు. లేఖను చదివిన సాహెబ్‌సింగ్‌ కన్నీటి పర్యంతమై.. పోలీసులకు ఫిర్యాదుచేయాలనుకొన్న విషయాన్ని పక్కనపెట్టేశాడు.


logo