మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 03:12:10

ప్రవాసీయులకు కువైట్‌ కోత!

ప్రవాసీయులకు కువైట్‌ కోత!

  • 8 లక్షల మంది భారతీయులు వెనుకకు?
  • ప్రవాసీ కోటా బిల్లుకు కువైట్‌ అసెంబ్లీ కమిటీ ఆమోదం 
  • విదేశీయుల జనాభాను 30 శాతానికి తగ్గించే పని
  • నిపుణులైన విదేశీయులే ఉండేందుకు అవకాశం!

న్యూఢిల్లీ: కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు తీసుకువచ్చిన ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆ దేశ జాతీయ శాసనసభ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే అక్కడ ఉన్న దాదాపు 8 లక్షల మంది భారతీయులు వెనుకకు రావాల్సి ఉంటుంది. అయితే అందరినీ ఒక్కసారే కాకుండా ఏడాదికి కొంతమంది చొప్పున క్రమక్రమంగా వెనక్కు పంపించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. కువైట్‌ మొత్తం జనాభా 43 లక్షలు. అందులో విదేశీయులే 30 లక్షలు. ఈ సంఖ్యలో అత్యధికంగా భారతీయులే 14 లక్షల మంది ఉన్నారు. తాజా బిల్లు ప్రకారం కువైట్‌లో భారత జనాభా 15శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. కరోనా ప్రభావంతో కువైట్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. కరోనా పాజిటివ్‌ కేసులు 49వేలు దాటాయి. ఈ నేపథ్యంలో విదేశీయులను వెనక్కు పంపించాలనే డిమాండ్‌ ఎక్కువైంది.  దీంతో ఆ దేశ ప్రధాని షేక్‌ సబా అల్‌-ఖలీద్‌ అల్‌-సబా ఈ బిల్లును ప్రతిపాదించారు. దేశంలో 70శాతంగా ఉన్న ప్రవాసీయులను 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఈ బిల్లుకు చట్ట ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. 

నైపుణ్యం ఉన్నవారికే అవకాశం 

కువైట్‌ తాజా బిల్లును బట్టి చూస్తే వివిధ అంశాల్లో నైపుణ్యం ఎక్కువగా ఉన్న విదేశీయులకు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతించే వీలుంది. ఆ దేశ అసెంబ్లీ స్పీకర్‌ మర్జూఖ్‌ అల్‌-ఘానెమ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం అక్కడ 28వేల మంది భారతీయులు నర్సులు, ఇంజినీర్లు, చమురు కంపెనీల్లో నిపుణులుగా పనిచేస్తున్నారు. 5.23 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉన్నారు. 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో నిర్మాణ కార్మికులు తదితర శ్రామికులను, డ్రైవర్ల లాంటి వారిని తిరిగి పంపనున్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఇండియా విదేశీ మారక నిల్వలు పెరగడంలో కువైట్‌ ముఖ్యమైన దేశంగా ఉన్నది. అక్కడ నుంచి 2018లో 4.8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 36వేల కోట్లు) చెల్లింపులు జరిగాయి. భారతీయులు భారీ సంఖ్యలో వెనక్కు వస్తే ఈ మొత్తం తగ్గిపోనున్నది.

ప్రాక్టికల్‌గా సాధ్యం కాని ప్రతిపాదన 

ప్రవాసీ కోటా బిల్లు గురించి, భారతీయులను తిప్పి పంపడానికి సంబంధించి అధికారిక సమాచారం ఏదీ కువైట్‌ ప్రభుత్వం తమకు తెలుపలేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కువైట్‌లోని భారతీయులను పంపించాలంటే వారి స్థానాల్లో పనిచేయడానికి ప్రత్యామ్నాయం అవసరం అని. ప్రాక్టికల్‌గా ఇది సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు


logo