సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 01:53:42

తెలంగాణ క్యారీ ఓవర్‌ తేల్చండి

తెలంగాణ క్యారీ ఓవర్‌ తేల్చండి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కృష్ణా బోర్డు మరో అంశాన్ని కేంద్ర జల్‌శక్తి కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకొన్నది. 2019-20 నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ 647.435 టీఎంసీల తన వాటాకు బదులుగా 651.995 టీఎంసీలను వాడుకోగా.. తెలంగాణ 333.527 టీఎంసీలలో 278.33 టీఎంసీలు మాత్రమే వాడింది. 2020-21 నీటి సంవత్సరంలో ఆగస్టు వరకు హైదరాబాద్‌, ఇతర తాగునీటి అవసరాలతోపాటు ప్రాజెక్టులకు వరద వచ్చేలోగా వర్షాకాలం పంటలకు సాగునీరందించేందుకు నాగార్జునసాగర్‌లో 50 టీఎంసీల కోటాను ఉంచుకున్నది. ఈ ఏడాది జనవరిలో బోర్డు జారీచేసిన నీటి విడుదల ఉత్తర్వుల్లోనూ ఆగస్టు వరకు అవసరాల కోసమంటూ స్పష్టంగా పేర్కొన్నది. ఆ కోటా నీటిని క్యారీ ఓవర్‌గా పరిగణించి, ఈ నీటి సంవత్సరంలో లెక్కించవద్దని తెలంగాణ కోరుతుంటే.. అది ఈ ఏడాది కోటాదేనని ఏపీ అంటున్నది. ఈ సమస్యపై కృష్ణా బోర్డు రెండు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ అంశాన్ని తేల్చాలంటూ శుక్రవారం బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్‌ మీనా కేంద్ర జల్‌శక్తి సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ అంశానికైనా పరిష్కారం దొరుకుతుందా? లేక గత ఆరేండ్లుగా అన్ని అంశాల మాదిరిగా ఇదికూడా అటకెక్కుతుందా? వేచి చూడాలి.


logo