శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 02:35:54

ప్రమాదం కాదు.. హత్య!

ప్రమాదం కాదు.. హత్య!

  • అక్కడ ల్యాండింగ్‌ ప్రమాదకరమని 2011లోనే హెచ్చరించాం 
  • ఆధారాలతో నివేదికను కూడా ఇచ్చాం 
  • అయినా అధికారులు పట్టించుకోలేదు 
  • వెల్లడించిన కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ 

ముంబై, ఆగస్టు 8: కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదానికి ఏవియేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి (టేబుల్‌టాప్‌) రన్‌వే విమానాలు దిగేందుకు ఏమాత్రం సురక్షితం కాదని 2011లోనే పౌరవిమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అప్పటి పౌరవిమానయానశాఖ కార్యదర్శి నసిమ్‌ జైదీకి 2011 జూన్‌లో నేరుగా కూడా చెప్పారు. కానీ ఆ నివేదికను అధికారులు పట్టించుకోలేదని మోహన్‌ రంగనాథన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి ప్రమాదంపై ఆయన స్పందించారు. ‘రన్‌వే తడిగా ఉండి, భారీ ఈదురుగాలులు వీస్తున్నప్పుడు విమాన సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని లాండింగ్‌ చేయటానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడ ఏఎల్‌ఏఆర్‌ (అప్రోచ్‌ అండ్‌ లాండింగ్‌ యాక్సిడెంట్‌ రిడక్షన్‌) పరిస్థితులు చాలా బలహీనంగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు కోజికోడ్‌ విమానాశ్రయంలోని ‘రన్‌వే 10’లో విమానాన్ని లాండ్‌ చేయటమంటే అందులోనివారందరూ మహా ప్రమాదంలో ఉన్నట్టే. ఇక్కడ ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే అది సాధారణ ప్రమాదం ఎంతమాత్రం కాదు. వారందరూ హత్యకు గురయ్యారని చెప్పాల్సి ఉంటుంది’ అని మోహన్‌ రంగనాథన్‌ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కోజికోడ్‌ విమానాశ్రయంలోని పదోనంబర్‌ రన్‌వే జారుడు బండలాగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘తొమ్మిదేండ్ల క్రితమే ప్రమాదాల గురించి హెచ్చరించి తగిన ఆధారాలు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఆ రన్‌వేపై ఇంకా విమానాలను నిర్వహిస్తున్నారు. అది అన్నిరకాలుగా భద్రమైనదని కూడా ప్రకటించారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

విమానాశ్రయానికి ఏడాది కిందటే నోటీసులు 

విమానాశ్రయంలో భద్రతా లోపాల గురించి గతేడాది జూలై 11నే ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌కు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు ఒక అధికారి తాజాగా వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు ఉన్నాయని, పలుచోట్ల నీరు నిలుస్తున్నదని, ల్యాండ య్యే విమానాల చక్రాల నుంచి రాలిపడే రబ్బరు ముక్కలు అధికంగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. గతేడాది జూలై 2న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇదే విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతుండగా వెనుకభాగం దెబ్బతిన్నది.

కేటాయించిన రనేవేలో దిగలేదు: ఏఏఐ చైర్మన్‌ 

ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం తనకు కేటాయించిన రన్‌వేలో ల్యాండ్‌ కాలేకపోయిందని, మరో రన్‌వేపై ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించగా ప్రమాదం సంభవించిందని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ తెలిపారు. కోజికోడ్‌లో రన్‌వేకు సంబంధించి 2015లో డీజీసీఏ పలు అంశాలను లేవనెత్తిందని, వాటిని పరిష్కరించాక 2019లో క్లియరెన్స్‌ వచ్చినట్లు చెప్పారు. కాగా ల్యాండింగ్‌ సమయంలో పైలట్లే సరిగా అంచనా వేయలేకపోయారని, సేఫ్‌ ల్యాండింగ్‌కు రన్‌వే తగినంత ఉన్నదని డీజీసీఏ అధిపతి అరుణ్‌కుమార్‌ చెప్పారు.


logo