సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 13:30:52

దుర్గాపూజా పందిళ్ల వ‌ద్ద 60 మందికి ఎంట్రీ..

దుర్గాపూజా పందిళ్ల వ‌ద్ద 60 మందికి ఎంట్రీ..

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజా  సంద‌డి రేప‌టి నుంచి ఆరంభంకానున్న‌ది. ఈ  నేప‌థ్యంలో ఇవాళ కోల్‌క‌తా హైకోర్టు కొంత ఊర‌ట క‌ల్పించింది.  దుర్గా పూజ మండ‌పాలను విజిట‌ర్ల‌కు నో ఎంట్రీ జోన్ల‌గా ప్ర‌క‌టించిన కోర్టు ఇవాళ కొంత స‌డ‌లింపు క‌ల్పించింది.  పెద్ద పెద్ద మండ‌పాల వ‌ద్ద సుమారు 60 మంది ఒకేసారి ఎంట్రీ కావ‌చ్చు అని తాజా తీర్పులో వెల్ల‌డించింది.  చిన్న చిన్న మండ‌పాల వ‌ద్ద 15 మందికి, పెద్ద పెద్ద పందిళ్ల వ‌ద్ద 60 మంది గుమ్మికూడే విధంగా ఆదేశాలు ఇచ్చింది. సుమారు 400 మంది నిర్వాహ‌కులు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది.

దేవీ న‌వ‌రాత్రుల్లో భాగంగా బెంగాల్‌లో దుర్గామాత పూజా ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు. అయితే ఈ సారి దుర్గాదేవి పందిళ్ల‌కు విజిట‌ర్స్‌ను అనుమ‌తించ‌రాదు అని కోల్‌క‌తా హైకోర్టు సోమ‌వారం రోజున త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.  కేవ‌లం నిర్వాహ‌కులు మాత్ర‌మే పందిళ్ల‌ల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కోల్‌క‌తా కోర్టు ఈ నిబంధ‌న‌ల‌తో కూడిన ఆదేశాలు జారీ చేసింది. పెద్ద‌పెద్ద పందిళ్ల‌లో 25 మంది, చిన్న‌వాటికి 15 మందికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల‌ను స‌డ‌లిస్తూ ఇవాళ కోల్‌క‌తా హైకోర్టు దుర్గా పందిళ్ల నిర్వాహ‌కుల‌కు కొంత ఊర‌ట క‌ల్పించింది.