శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 19:27:08

పానీపూరిల్లో టాయిలెట్ వాట‌ర్ క‌లిపిన వీధి వ్యాపారి

పానీపూరిల్లో టాయిలెట్ వాట‌ర్ క‌లిపిన వీధి వ్యాపారి

ముంబై: పానీ పూరి! ఈ పేరు విన‌గానే చాలామందికి వెంట‌నే నోరూరుతుంది. ఒకప్పుడు కేవ‌లం పట్టణాల్లో మాత్ర‌మే క‌నిపించే ఈ పానీపూరి ఇప్పుడు గ్రామాలకు కూడా విస్త‌రిస్తున్న‌ది. కరోనా కార‌ణంగా ప్రస్తుతం కొంత వ‌ర‌కు పానీపూరీకి డిమాండ్ త‌గ్గినా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే మ‌ళ్లీ జోరుగా అమ్ముడు కాబోయే చిరుతిండి అదే. అయితే ఇంత క్రేజ్ ఉన్న పానీపూరీని కొంత‌మంది వీధి వ్యాపారులు క‌ల్తీ చేస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఇప్ప‌టివ‌ర‌కు పానీపూరి త‌యారీకి క‌ల్తీ నూనె వాడుతార‌నే భ‌యాలు మాత్ర‌మే ఉండేవి. 

కానీ ఇప్పుడు పానీపూరీ వ్యాపారులు నూనె మాత్ర‌మే కాదు, నీళ్లను కూడా క‌ల్తీ చేస్తార‌నే విష‌యం వెల్ల‌డైంది. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ పానీపూరీ వ్యాపారి.. టాయిలెట్‌ వినియోగించేందుకు పెట్టిన నీళ్ల‌ను పానీపూరికి వాడే రసంలో కలిపేశాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో స్థానిక జనాలు అతడిని చితకబాదారు. కొల్హాపూర్‌ పట్టణంలోని రంకాల లేక్‌ సమీపంలో ‘ముంబై కా స్పెషల్‌ పానీ పూరి వాలా’ పేరుతో స‌ద‌రు వ్యాపారీ పానీపూరీ బండిని నిర్వ‌హిస్తున్నాడు. 

అత‌ని పానీపూరీ బండి ద‌గ్గ‌ర జ‌నం ఎప్పుడూ క్యూ కడుతారు. అయితే, ఒక రోజు గిరాకీ బాగా రావ‌డంతో బిందెలో ర‌సం అడుగుకు చేరింది. దాంతో అత‌డు బండిని మూసేయ‌డ‌మో లేక శుభ్ర‌మైన నీటిని తేవ‌డ‌మో చేయ‌కుండా ప‌క్క‌నే టాయిలెట్‌లో పోసేందుకు పెట్టిన నీళ్ల‌ను తెచ్చి క‌లిపాడు. అయితే ఓ వ్య‌క్తి అతడి నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేయడంతో బండారం బ‌య‌ట‌ప‌డింది. ఆ వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో అతడిని చిత‌క‌బాదారు. పానీపూరి బండిని ధ్వంసం చేశారు. పానీపూరి ప్రియులారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.