శనివారం 24 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 09:36:48

కేరళ గోల్డ్‌ స్కామ్‌.. కొడువల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ అరెస్ట్‌

కేరళ గోల్డ్‌ స్కామ్‌.. కొడువల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ అరెస్ట్‌

కోజికోడ్‌: దేశంలో సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌ స్కామ్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. ఈ కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడువల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ కరాత్‌ ఫైజల్‌ను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున కస్టమ్స్‌ అధికారులు ఆయన ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. బంగారం అక్రమ తరలింపు కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్‌, షరీఫ్‌, ఫైజల్‌ ఫరీద్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.  

తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్‌లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్‌లో భారీగా బంగారం పట్టుబడటంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్‌ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. 


logo