సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 12:46:23

కొచ్చి మెట్రో రైళ్ల‌లో సైకిళ్ల‌ను తీసుకెళ్లొచ్చు!

కొచ్చి మెట్రో రైళ్ల‌లో సైకిళ్ల‌ను తీసుకెళ్లొచ్చు!

కొచ్చి: ఖ‌ర్చు కొంచెం ఎక్కువే అయినా మెట్రో రైళ్లు మ‌హాన‌గ‌రాల్లో ప్ర‌యాణాన్ని సుల‌భ‌త‌రం చేశాయి. న‌గ‌ర జీవి గంట‌ల‌పాటు ట్రాఫిక్‌లో చిక్కుకునే ప‌రిస్థితి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. అయితే మెట్రో లైన్‌లు ప్ర‌ధాన ర‌హ‌దారుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డంతో రైలు ఎక్క‌డానికి, రైలు దిగిన త‌ర్వాత గ‌మ్య స్థానానికి చేరుకోవ‌డానికి ఆటోల్లోనో లేదంటే సొంత వాహ‌నాల్లోనో వెళ్లాల్సి వ‌స్తుంది. ఆటోల్లో వెళ్తే అద‌న‌పు ఖ‌ర్చు భ‌రించాలి. ఒక‌వేళ‌ సొంత వాహ‌నాల్లో వెళ్లినా రైలు దిగిన త‌ర్వాత గ‌మ్యస్థానం చేరుకోవ‌డానికి అద్దె వాహనాన్ని ఆశ్ర‌యించాల్సిందే. 

ఈ నేప‌థ్యంలో కేర‌ళ‌లోని కొచ్చి మెట్రోరైల్ కార్పోరేష‌న్‌ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక నుంచి మెట్రో రైళ్ల‌లో సైకిళ్లను కూడా తీసుకెళ్లవ‌చ్చ‌ని తెలిపింది. అయితే ప్రస్తుతానికి కేవలం ఆరు మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రకటించింది. చంగంపుఝా పార్క్, పాలరివత్తం, టౌన్‌హాల్, ఎర్నాకుళం సౌత్, మహారాజా కాలేజీ, ఎర్నాకుళం మెట్రోస్టేషన్‌లలో మాత్రమే సైకిళ్లను తీసుకెళ్లవ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. ప్రజల ఆదరణను బ‌ట్టి ఈ వెసులుబాటును అన్ని స్టేషన్లకు విస్తరించేది నిర్ణయిస్తామ‌న్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా<.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.