ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 19:06:42

రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయ్‌!

రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి.. షరతులు వర్తిస్తాయ్‌!

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు.. జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీకి ఉపక్రమించారు. కొన్ని షరతులను విధిస్తూ ఢిల్లీ పోలీసులు రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించారు. పోలీసులు, రైతులు చర్చించిన మీదట పరస్పర అంగీకారం మేరకు మూడు మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించుకొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి తమ పరిధిలో లేదని, అది ఢిల్లీ పోలీసులు చూసుకుంటారని రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు దాదాపు రెండు నెలలుగా దేశ రాజధాని శివారులో ఆందోళన చేపట్టారు. తమ ఆందళనలు ఎంత తీవ్రంగా ఉన్నదో చూపించేందుకు రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని రైతులు ఇప్పటికే ప్రకటించారు. ఒకవైపు గణతంత్ర దినోత్సవం జరుగుతుండటం.. మరోవైపు రైతుల ట్రాక్టర్ల ర్యాలీతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీ పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదివారం చాలా సమయం మేరకు చర్చలు కొనసాగిన అనంతరం.. కొన్ని షరతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతించారు. అయితే, ఢిల్లీలోని మూడు ప్రదేశాల నుంచి మాత్రమే ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడానికి అనుమతి ఉంది. ఇందుకోసం ఈ మూడు సరిహద్దుల నుంచి బారికేడ్లను పోలీసులు తొలగించనున్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించరాదని, ప్రజలపైగానీ, ఇతర సంస్థలపై గానీ దాడులకు ప్రేరేపించకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు.

ర్యాలీ నిర్ణయించిన మార్గాలు

సింఘు: ట్రాక్టర్ పరేడ్ సింఘు సరిహద్దు నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సంజయ్ గాంధీ రవాణా, కంజావ్లా, బవానా, హర్యానాలోని ఆచిండి సరిహద్దు మీదుగా వెళ్తుంది.

టికారి: టికారి బోర్డర్ నుంచి ట్రాక్టర్ పరేడ్ నాగ్లోయి, నజాఫ్‌గఢ్‌, జోడా, బద్లి మీదుగా కేఎంపీకి వెళ్తుంది.

ఖాజీపూర్ యూపీ గేట్: ట్రాక్టర్ పరేడ్ అప్సరా బోర్డర్ నుంచి దాస్నా, ఘజియాబాద్ మీదుగా యూపీకి వెళ్తుంది.

సీఏపీఎప్‌ మోహరింపు

రైతుల ట్రాక్టర్ పరేడ్ నేపథ్యంలో సీఏపీఎఫ్ బలగాల మోహరింపును ఢిల్లీ పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల బృందం మొత్తం భద్రతను దృష్టిలో పెట్టుకుని బలగాలను మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రిపబ్లిక్‌ డే పరేడ్ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించి అన్ని భద్రతా ఏజెన్సీలు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. వీటితోపాటు సీఏపీఎఫ్ సిబ్బంది స్టాండ్‌బైలో సిద్ధంగా ఉండనున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo