గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 07, 2020 , 06:28:25

ఇవాళ కూత పెట్టనున్న తొలి ‘కిసాన్‌ రైల్‌’

ఇవాళ కూత పెట్టనున్న తొలి  ‘కిసాన్‌ రైల్‌’

న్యూఢిల్లీ : రైతులకు ఉపశమనం కలిగించడానికి భారత రైల్వే కొత్త రైలును ప్రవేశపెట్టింది. భారతీయ రైల్వే పండ్లు, కూరగాయలను రవాణా చేయడానికి ఇవాళ (ఆగస్టు 7) తన మొదటి ‘కిసాన్ రైల్’ సేవను ప్రారంభించబోతోంది. మొదటి రైలు మహారాష్ట్రలోని దేవ్లాలి మధ్య బీహార్ లోని దానపూర్ వరకు నడుస్తుందని రైల్వే తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్‌లో పాడైపోయే పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులను రవాణా చేయడానికి ‘కిసాన్ రైల్’ నడుపుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పథకం కింద, కోల్డ్ స్టోరేజ్‌తో పాటు రైతు ఉత్పత్తులను రవాణా చేసే వ్యవస్థ ఉంటుంది. రైల్వే మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో, ‘ఈ ఏడాది బడ్జెట్‌లో, పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన సరఫరా గొలుసును ఏర్పాటు చేయడానికి’ కిసాన్ రైల్ నడుపుతున్నట్లు ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవ్లాలి నుంచి దానపూర్‌ వరకు మొదటి రైలు నడవునుండగా, మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు 1,519 కిలోమీటర్లు ప్రయాణించి దానపూర్ (బీహార్) చేరుకుంటుంది.

ఈ రైలు వారికోసారి నడుస్తుంది. సెంట్రల్ రైల్వే భూసావల్ డివిజన్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నాసిక్, దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో తాజా కూరగాయలు, పండ్లు, పువ్వులు, ఉల్లిపాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తున్నారు. సరిగ్గా నిర్వహించకపోతే ఈ ఉత్పత్తులు త్వరగా కుళ్లిపోతాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులను నాసిక్‌లోని ఈ ప్రాంతాల నుంచి బీహార్‌లోని పాట్నా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, కట్ని, మధ్యప్రదేశ్ లోని సత్నా ఇతర ప్రాంతాలకు పంపుతారు. రవాణా చేస్తుంటారు.

ఈ ఉత్పత్తులను గమ్యస్థానానికి అందించడానికి కిసాన్ రైల్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ రైలు నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, భూసావాల్, బుర్హాన్పూర్, ఖండ్వా, ఇటార్సి, జబల్పూర్, సత్నా, కట్ని, మణిక్పూర్, ప్రయాగ్రాజ్ చెయోకి, పాండిందయల్ ఉపాధ్యాయనగర్, బక్సర్ వద్ద ఆగుతుంది. ఎయిర్ కండిషనింగ్ సదుపాయంతో పాటు పండ్లు, కూరగాయలను తీసుకెళ్లే సదుపాయాన్ని 2009-10 బడ్జెట్‌లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినా ప్రారంభానికి నోచుకోలేదు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo