శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 03:20:28

‘కన్నడ బోల్ట్‌'కు కోచింగ్‌

‘కన్నడ బోల్ట్‌'కు కోచింగ్‌
  • కంబళ రేసర్‌ శ్రీనివాస గౌడపై ప్రశంసల వర్షం
  • అతడిని అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దాలంటూ కేంద్రానికి సూచనలు
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు
  • సాయ్‌ నుంచి గౌడకు పిలుపు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జమైకాకు చెందిన ప్రఖ్యాత అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ను కూడా తలదన్నేరీతిలో పరుగులు తీసిన కర్ణాటకకు చెందిన కంబళ క్రీడాకారుడు శ్రీనివాస గౌడపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ వెలుగుచూడని  ఈ జాతి రత్నానికి సరైన తర్ఫీదునిచ్చి అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర తదితరులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. శ్రీనివాస గౌడకు స్పోర్ట్స్‌అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) నిపుణుల ఆద్వర్యంలో పరీక్షలు నిర్వహించి, అతడి ప్రతిభకు మరింత మెరుగు పెడుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో గౌడకు సాయ్‌ నుంచి పిలుపు అందింది. సోమవారం అతడిని బెంగళూరు కేంద్రానికి తీసుకురావడానికి రైలు టికెట్లు బుక్‌ చేశామని ఆ సంస్థ చెప్పింది. 

కర్ణాటకలో సంప్రదాయంగా నిర్వహించే కంబళ క్రీడా పోటీల్లో 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలో చేరుకున్న శ్రీనివాస గౌడపై ఆనంద్‌ మహీంద్రా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌ రావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ వంటి ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.


 శ్రీనివాస గౌడకు 100 మీటర్ల అథ్లెట్‌గా సరైన తర్ఫీదును ఇవ్వడం ద్వారా లేదా ఒలింపిక్‌ క్రీడల్లో కంబళ క్రీడను ప్రవేశపెట్టడం ద్వారా.. అతనికి బంగారు పతకం వచ్చేలా చేయాలని ఆనంద్‌ మహీంద్ర కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును కోరారు. దీనికి స్పందించిన మంత్రి.. శ్రీనివాసను సాయ్‌కు పిలిపిస్తామని, అక్కడ నిపుణులైన కోచ్‌లు అతనికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ‘సాయ్‌ అత్యున్నత నిపుణులు నిర్వహించే పరీక్షల కోసం శ్రీనివాస గౌడను పిలిపిస్తాం. ఒలింపిక్‌ క్రీడల్లో భాగంగా నిర్వహించే అథ్లెట్‌ పోటీలకు కావలసిన ప్రమాణాలపై మనదగ్గర చాలామందికి సరైన అవగాహన లేదు. నైపుణ్యం కలిగిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం’ అని ట్వీట్‌ చేశారు. గౌడకు సరైన తర్ఫీదునిస్తే దేశానికి కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాడని బీజేపీ నేత పీ మురళీధర్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, శ్రీనివాస గౌడని సోమవారం బెంగళూరు సాయ్‌ కేంద్రానికి తీసుకురావడానికి రైలు టికెట్లు బుక్‌ చేశామని సాయ్‌ ట్విట్టర్‌లో పేర్కొంది. అక్కడి కోచ్‌లు అతనికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపింది. అలాగే క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఔత్సాహికులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తామని ట్వీట్‌ చేసింది. తనపై ఇంతటి ప్రశంసల వర్షం కురుస్తున్నప్పటికీ, శ్రీనివాస గౌడ మాత్రం ఎంతో వినయంగా స్పందించారు. కంబళ పోటీలో పరిగెత్తిన తనను ప్రఖ్యాత అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్ట్‌తో పోలుస్తున్నారని, ఆయన ప్రపంచ ఛాంపియన్‌ అని, కానీ తాను బురద నేలల్లో పరిగెత్తేవాడినని మీడియాతో వ్యాఖ్యానించటం విశేషం. 


ఎలా కొలిచారు?

శ్రీనివాస గౌడపై ఒకవైపు ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు కొందరు అథ్లెట్‌ నిపుణులు ఈ విషయంలో పెదవి విరుస్తున్నారు. ‘కంబళ క్రీడల్లో శ్రీనివాస గౌడ దున్నపోతుల వెనుక పరిగెత్తాడే తప్ప, వాటి ముందు కాదు. అలాగే, 9.55 సెకండ్లలో గౌడ 100 మీటర్ల దూరాన్ని చేరుకున్నాడని అంటున్నారు. ఈ సమయాన్ని స్టాప్‌వాచీ, చేతి గడియారం లాంటి సాధనాలతో లెక్కించారా?’ అని ఓ నిపుణుడు ప్రశ్నించాడు. అంతర్జాతీయ అథ్లెట్‌ క్రీడల్లో సమయాన్ని లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ గడియారాల్ని ఉపయోగిస్తారని వెల్లడించాడు.


logo