ఆదివారం 29 మార్చి 2020
National - Feb 28, 2020 , 10:44:32

అల్లరి మూకల దాడి.. 36 గంటలు నొప్పులు భరించి బిడ్డకు జన్మ

అల్లరి మూకల దాడి.. 36 గంటలు నొప్పులు భరించి బిడ్డకు జన్మ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కరవాల్‌ నగర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా జరిగిన ఘర్షణల్లో ఓ నిండు గర్భిణిపై అల్లరిమూకలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ గర్భిణి సుమారు 36 గంటలు నొప్పులు భరించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 24న తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో గర్భిణి షబనా పర్వీన్‌(30) నివాసంలోకి దుండగులు చొరబడ్డారు. ఆమె భర్త, అత్తపై వారు దాడి చేశారు. గర్భిణి అని చూడకుండా.. ఆమె పొత్తి కడుపుపై తన్నారు. అత్త, భర్తతో పాటు గర్భిణిని ఇంటి నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత ఇంట్లోని వస్తువులన్నింటినీ ఒక చోట వేసి నిప్పు పెట్టారు. తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న పర్వీన్‌ను అదే రోజు రాత్రి సమీప ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ఆల్‌ హింద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆ ఆస్పత్రిలో 36 గంటల పాటు నొప్పులు భరించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పర్వీన్‌. ఆ బిడ్డ తమకు మిరాకిల్‌ బేబీ అని పర్వీన్‌ దంపతులు తెలిపారు. అయితే వారి ఇంటికి నిప్పు పెట్టడంతో.. ఇప్పుడు ఎక్కడికో వెళ్లాలో తెలియని పరిస్థితి. అన్ని వస్తువులు కాలిబూడిద అయ్యాయి. బంధువుల ఇంటికి వెళ్లడమే తమకున్న దారి అని పర్వీన్‌ అత్త నషీమా పేర్కొన్నారు.


logo