గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 18:43:29

వ‌రి సాగుపై ఈ రాష్ట్రంలో నిషేధం

వ‌రి సాగుపై ఈ రాష్ట్రంలో నిషేధం

చండీగ‌ఢ్‌: వ‌రిసాగుపై హ‌ర్యానా రాష్ట్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. వ‌రి సాగు చేస్తే ప్ర‌భుత్వం క‌ల్పించే క‌నీస మ‌ద్ద‌తు ధ‌రను క‌ల్పించ‌మ‌ని తేల్చి చెప్పింది. మొత్తం 26 బ్లాకుల్లో వ‌రిసాగు పూర్తిగా నిలిపివేసి ఇత‌ర పంటలు సాగు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇత‌ర పంట‌కు మారిన రైతుల‌కు ఎక‌రానికి రూ.7000 ప్రోత్సాహ‌కం వివిధ రూపాల‌లో ఇస్తామ‌ని తెలిపింది. భూగ‌ర్భ జ‌ల‌మ‌ట్టం 35 మీట‌ర్ల క‌న్నా త‌క్కువ ఉన్న గ్రామ పంచాయ‌తీల్లో వ‌రి విత్త‌డానికి వీలు లేద‌ని, ఇక్క‌డ విత్త‌నాల స‌ర‌ఫ‌రాను పూర్తిగా నిలిపివేయాల‌ని ఆదేశించింది. దీంతో 1 ల‌క్ష 37 వేల ఎక‌రాల్లో రైతులు వ‌రి నుంచి మ‌రో పంట‌కు మారాల్సి ఉంటుంది. ఎక‌రానికి 2వేల ప్రోత్సాహ‌కం, ఉచిత హైబ్రీడ్ విత్త‌నాలు, పంట బీమా చెల్లిస్తామ‌ని హామి ఇస్తుంది. ఈ ప‌థ‌కంలో భాగ‌మైన  24 బ్లాకుల్లో రైతుల జీవితాలు, వారి జీవ‌నోపాధిపై ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుంద‌నే దానిపై అధ్య‌య‌నం చేయ‌నుంది.

ఈ ప‌థ‌కాన్ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.  కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ర‌ణ‌దీప్ సింగ్ సుర్జేవాలా, రాష్ట్ర పార్టీ అధ్య‌క్షులు కుమారి సెల్జాతో సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వీరు మాట్లాడుతూ... మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన కొత్త నిరంకుశ ప‌థ‌కం ద్వారా రైతులు పంట పండించే హ‌క్కులు కోల్పోతార‌‌న్నారు. వ‌రిసాగు చేస్తున్న రైతుల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ను తిర‌స్క‌రించి వారిని శిక్షించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. రైతుల జీవితాలు, జీవ‌నోపాధి ప్ర‌మాదంలో ప‌డేస్తుంద‌న్నారు. ఈ ప‌థ‌కం విఫ‌ల‌మైతే అనేక మంది రైతుల త‌మ పోలాల‌ను బీడు భూములుగా వ‌దిలేస్తార‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కాల‌కు బ‌దులు, త‌మ భూమిలో ఇష్ట‌ప‌డే పంట‌ను పండించే హ‌క్కును దూరం చేయ‌డం న్యాయం కాద‌న్నారు.  ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు చెబుతోంద‌ని ఈ ఉత్త‌ర్వుతో 2.30 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రిసాగుకు రైతులు దూర‌మౌతార‌ని తెలిపారు. 


logo