బుధవారం 28 అక్టోబర్ 2020
National - Aug 23, 2020 , 22:13:28

ఖలిస్తానీ జెండా మళ్లీ ఎగిరింది

ఖలిస్తానీ జెండా మళ్లీ ఎగిరింది

పంజాబ్ : ఖలిస్తానీ జెండా ఎగురవేసిన ఘటనతో మొగా మళ్లీ వార్తల్లోకెక్కింది. ఆదివారం మరోసారి ఖలిస్తాన్ జెండా ఎగురవేశారని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జెండాను తొలగించారు. గత తొమ్మిది రోజులలో ఖలిస్తాన్ జెండా ఎగురవేయడం ఇది మూడోసారి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఖలిస్తానీ జెండా ఎగురవేసిన సూత్రధారిని మాత్రం పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారు. నిందితుడు ఒక పోలీసు కుమారుడు కావడం విశేషం.

ఆదివారం ఖలిస్తాన్ జెండా ఎగురేసిన ప్రాంతం మొగా నగరంలోని కోట్కాపురా బైపాస్‌లో ఉంది. రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జెండాను ఎగురవేశారు. జెండాపై ఖలిస్తాన్ జిందాబాద్ అని ఎంబ్రాయిడరీ చేశారు. ఈ విషయం డీఎస్పీ దృష్టికి రాగానే పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని.. వివాదాస్పద జెండాను తొలగించారు. కాగా, ఖలిస్తానీ జెండాను లఖ్ లజపత్ రాయ్ గ్రామం ధూడికేలో కూడా ఎగురవేశారు.

ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో రోలీ గ్రామానికి చెందిన జస్పాల్, ఇంద్రజిత్ సింగ్.. త్రివర్ణ పతాకాన్ని అవమానించడమే కాకుండా అక్కడ ఖలిస్తానీ జెండాను ఎగురవేశారని, ఫిరోజ్‌పూర్‌లోని సాధువాలా గ్రామంలో నివసిస్తున్న ఆకాశ్‌దీప్ వీడియో చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశ్‌దీప్‌ను ఆరు రోజుల క్రితం అరెస్టు చేసినప్పటికీ, మరో ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. వారిలో ఒకరు పోలీసు అధికారి కొడుకు కావడం వల్ల అరెస్టు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


logo