మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 15:19:58

నా లాంటి కార్య‌క‌ర్త‌ల‌ను కేశూభాయ్ తీర్చిదిద్దారు: ప‌్ర‌ధాని మోదీ

నా లాంటి కార్య‌క‌ర్త‌ల‌ను కేశూభాయ్ తీర్చిదిద్దారు: ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: గుజ‌రాత్ మాజీ సీఎం కేశూభాయ్ ప‌టేల్ ఇవాళ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపారు.  త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో  వీడియో సందేశాన్ని పోస్టు చేసిన మోదీ.. కేశూభాయ్ ప‌ట్ల ఉన్న త‌న అభిమానాన్ని వ్య‌క్తం చేశారు.  నా లాంటి ఎంద‌రో కార్య‌క‌ర్త‌ల‌ను కేశూభాయ్ తీర్చిదిద్దార‌ని అన్నారు.   ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌ప‌డేవార‌న్నారు.  కేశూభాయ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, శ్రేయోభిలాషుల‌కు సంతాపం తెలుపుతున్నాన‌ని, కేశూ కుమారుడు భ‌ర‌త్‌తో మాట్లాడిన‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న వీడియో ట్వీట్‌లో తెలిపారు.  గుజ‌రాతీ నేల‌కు చెందిన ప్రియ‌త‌మ నేత కేశూభాయ్ మ‌ర‌ణ వార్త‌ను ఊహించ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు.  చాలా దుఖం వేస్తోంద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌న‌లో మౌనాన్ని నింపిన‌ట్లు వెల్ల‌డించారు.  కేశూ మ‌ర‌ణం త‌న‌కు ఓ తండ్రిని కోల్పోయిన‌ట్లు  ఉంద‌న్నారు.  దేశ భ‌క్తి ల‌క్ష్యంతో కేశూ ప‌నిచేశార‌న్నారు.  ఆయ‌న వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హారంలో సౌమ్య‌త‌, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో దృఢ నిశ్చ‌య శ‌క్తి అచంచ‌ల‌మైంద‌న్నారు. సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన కేశూభాయ్‌.. రైతులు, పేద‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకునేవార‌న్నారు.  కేశూ వివిధ హోదాల్లో త‌న నిర్ణ‌యాల‌తో రైతుల‌కు ఎంతో మేలు చేశార‌న్నారు.  రైతుల జీవితాల‌ను సుల‌భ‌‌తరం చేశార‌న్నారు.