గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 12:09:19

4 గంటలు ముఖంపై తేనెటీగలతో గిన్నీస్‌ రికార్డు..వీడియో

4 గంటలు ముఖంపై తేనెటీగలతో గిన్నీస్‌ రికార్డు..వీడియో

తేనెటీగలు అమృతపానీయం లాంటి తేనెనందిస్తాయి. కానీ ఒక్క తేనెటీగ కుడితే ఎంత మంటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెట్టుపై ఉన్న తేనెటీగలు తుట్టె నుంచి పైకి లేచాయంటే పరుగులు పెట్టాల్సిందే. తేనెటీగలు కుట్టి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ కేరళలో ఓ యువకుడికి తేనెటీగలంటే ఏ మాత్రం భయం లేదు. కొసమెరుపేంటంటే తేనెటీగలు అతనికి మంచి స్నేహితులు. అవును మీరు చదివింది నిజమే. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

న్యాచుర్‌ ఎంఎస్‌ అనే 24 ఏండ్ల యువకుడు తేనెటీగలను ముసుగు లాగా తన ముఖాన్ని కప్పేసుకున్నాడు. తేనెటీగలు న్యాచుర్‌ ఎంఎస్‌ తలపై, మెడభాగం చుట్టూ కవర్‌ అతుక్కొని పోయాయి. సదరు యువకుడు ఇలా తేనెటీగలతో 4 గంటల 10 నిమిషాలపాటు ఉండి..గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సంపాదించాడు. రిస్కీ ఫీట్‌ పూర్తయిన తర్వాత నిపుణుల సాయంతో తేనెటీగలను తీసివేశారు.

తేనెటీగలు తనకు మంచి స్నేహితులు. నేను చేసిన పనితో నా మిగిలిన స్నేహితులు కూడా వాటిని ఇష్టపడతారని న్యాచుర్‌ ఎంఎస్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొదట నేను రాణి ఈగను నా చేతిలోకి తీసుకొని తర్వాత తలపై పెట్టుకున్నా. మరుసటి రోజు చాలా సంఖ్యలో తేనెటీగలు వచ్చి నా ముఖాన్ని కప్పేశాయని న్యాచుర్‌ ఎంఎస్‌ అన్నాడు. ఎపి కల్చర్‌ (తేనెటీగల పెంపకం) ప్రాధాన్యతను తెలుపుతూ న్యాచుర్‌ ఎంఎస్‌ రెండేళ్ల క్రితం వరల్డ్‌ రికార్డును సృష్టించేందుకు ప్రయత్నించాడు. logo