శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 15:30:12

సీబీఐకి దర్యాప్తు సమ్మతిని వెనక్కి తీసుకున్న కేరళ

సీబీఐకి దర్యాప్తు సమ్మతిని వెనక్కి తీసుకున్న కేరళ

తిరువనంతపురం: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు దర్యాప్తు కోసం గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని కేరళ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. బుధవారం నాటి క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇకపై ఆ రాష్ట్రంలో దర్యాప్తు కోసం ప్రభుత్వం అనుమతిని సీబీఐ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం పినరాయి విజయన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపడుతున్న హౌసింగ్‌ ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా ప్రభుత్వం పిటిషన్‌తో కేరళ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని కేరళ ప్రభుత్వం వెనక్కితీసుకున్నది.

కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ, ఢిల్లీ ప్రత్యేక పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కిందకు వస్తుంది. దీని ప్రకారం ప్రజల భద్రత, పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల కిందకు వస్తాయి. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై దర్యాప్తు కోసం సీబీఐకి అన్ని రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని తెలియజేశాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలున్నాయి.

దీంతో 2018లో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలు సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి. అయితే 2019లో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. మరోవైపు 2019 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌, 2020 జూలైలో రాజస్థాన్‌, గత నెలలో మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకోగా తాజాగా కేరళ కూడా ఈ రాష్ట్రాల సరసన చేరింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.