సోమవారం 25 మే 2020
National - Apr 08, 2020 , 07:37:47

కరోనా లక్షణాలు లేవు కానీ.. ఇద్దరికి పాజిటివ్‌

కరోనా లక్షణాలు లేవు కానీ.. ఇద్దరికి పాజిటివ్‌

తిరువనంతపురం : కరోనా వైరస్‌ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ ఓ ఇద్దరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిద్దరిలో ఒకరు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి కాగా, మరొకరు 19 ఏళ్ల యువతి. 

ఇది ఒక హెచ్చరిక. కరోనా వైరస్‌ సోకినప్పటికీ కొంత మందికి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనబడటం లేదు. ఇలాంటి వారు బయటకు వచ్చి పలువురితో కలిసి తిరుగుతున్నారు. వీరి వల్ల మనకు తెలియకుండానే కరోనా సోకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

కేరళలోని పట్టణంతిట్టకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి.. షార్జా నుంచి తిరువనంతపురానికి మార్చి 19న ఎయిర్‌ అరేబియా విమానంలో వచ్చాడు. అక్కడ్నుంచి తిరువనంతపురంలోని ఓ టీ షాపు వద్దకు వెళ్లి అక్కడ టీ తాగాడు. అటు నుంచి చక్కయి జంక్షన్‌ మీదుగా పట్టణంతిట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అనంతరం అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఏప్రిల్‌ 6న ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కానీ ఇతనిలో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు కనిపించలేదు. కానీ కరోనా పాజిటివ్‌ వచ్చింది.

ఓ 19 ఏళ్ల యువతి ఢిల్లీ నుంచి మార్చి 17న ఎర్నాకులంకు చేరుకుంది. అక్కడ్నుంచి బస్సులో తన సొంతూరుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె హోంక్వారంటైన్‌లో ఉన్నారు. హోం క్వారంటైన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత ఆ యువతికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఏప్రిల్‌ 4వ తేదీన ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేరళలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 336 నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. 


logo