బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 17:20:14

లాక్‌డౌన్‌ వేళ.. సైబర్‌ మోసగాళ్ల గోల

లాక్‌డౌన్‌ వేళ.. సైబర్‌ మోసగాళ్ల గోల

న్యూఢిల్లీ: ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్టకు నిప్పడిగాడంట ఇంకొకడు.. అన్నట్టుగా ఉంది సైబర్‌ నేరగాళ్ల తీరు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రపంచదేశాల ప్రజలు నిన్నమొన్నటి వరకు ఇండ్లకే పరిమితమయ్యారు. సినిమాలు చూస్తూ.. గేమ్స్‌ ఆడుతూ.. కొత్తకొత్త  చాలేంజీలతో కాలం గడిపారు. ఇదే సమయంలో తమకు కావాల్సిన వస్తువుల కోసం ఇంటర్నెట్‌లో వెతికివెతికి అక్కడ కనిపించిన ఫోన్‌ నంబర్లకు ట్రైచేసి సైబర్‌ నేరస్థులకు అడ్డంగా బుక్కైన వారెందరో ఉన్నారు. సైబర్‌ మోసాలు నిత్యం జరుగుతున్నా.. అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు మొత్తుకొంటున్నా.. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు సైబర్‌ నేరస్థులకు చిక్కి నిలువుదోపిడికి గురవుతున్నారు. 

ఇలా లాక్‌డౌన్‌ వేళ జరిగిన సైబర్‌ మోసాలలో కేరళ తొలి స్థానంలో ఉన్నదని ఐటీ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన కే7 కంప్యూటింగ్‌ అనాలిసిస్‌లో తేల్చింది. కొవిడ్‌-19ను ఆసరగా చేసుకొని పీఎంకేర్స్‌ పేరిట, దలైలామా శిష్యుడి పేరిట నకిలీ వెబ్‌సైట్లను ప్రారంభించి దండుకొన్న విషయం  తెలిసిందే. ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ వరకు ఇలాంటి సైబర్‌ మోసాలు ఎన్నో జరిగాయని ఆ సంస్థ పేర్కొన్నది. కేరళలో రెండు వేలకు పైగా కేసులు నమోదవగా.. పంజాబ్‌, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయట. గమ్మత్తైన విషయమేంటంటే.. సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కి జేబులు ఖాళీ చేసుకొంటున్న వారిలో అత్యధికులు బాగా చదువుకున్నవారే ఉన్నారట.


logo