మంగళవారం 02 జూన్ 2020
National - Apr 02, 2020 , 01:34:52

ఒక్క వ్యక్తి.. 300 మందికి క్వారంటైన్‌!

ఒక్క వ్యక్తి.. 300 మందికి క్వారంటైన్‌!

  • జమ్ముకశ్మీర్‌లో నిజాముద్దీన్‌ ప్రకంపనలు 

న్యూఢిల్లీ: నిజాముద్దీన్‌ ప్రకంపనలు కశ్మీర్‌లోనూ వినిపిస్తున్నాయి. శ్రీనగర్‌కు చెందిన ఒక వ్యాపారి జమాత్‌ సదస్సు కోసం మార్చి ఏడో తేదీన ఢిల్లీకి విమానంలో చేరుకున్నారు. మార్చి 9న ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌కు రైలులో వెళ్లారు. దారూల్‌ ఉలూమ్‌ సంస్థ నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. మార్చి 11న రైలులో జమ్ముకు చేరుకుని వైద్యుడైన తన మిత్రుడితో కలిసి ఓ సభలో మాట్లాడారు. వారిద్దరు మార్చి 16 వరకు జమ్ములోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు విమానంలో శ్రీనగర్‌కు చేరుకుని అనంతరం సొపోర్‌కు వెళ్లారు. మార్చి 18న రోడ్డు మార్గంలో శ్రీనగర్‌కు తిరిగొచ్చారు. జ్వరం, ఛాతిలో నొప్పి వల్ల  మార్చి 21న స్థానిక దవాఖానలో చేరిన ఆ వ్యాపారిని తర్వాత శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్‌ దవాఖానకు తరలించారు. తొలుత అలర్జీ కేసుగా పరిగణించిన వైద్యులు.. మరునాడు అతడి పరిస్థితి దిగజారడంతో శ్రీనగర్‌ ఛెస్ట్‌ అండ్‌ డిసీజ్‌ దవాఖానకు తరలించగా మార్చి 26న మరణించారు. జమ్ముకశ్మీర్‌లో తొలి కరోనా మృతి ఆయనదే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  వ్యాపారి ప్రయాణించిన విమానాలు, రైళ్లలోని ప్రయాణికుల వివరాలను సేకరించి 300 మంది అనుమానితులను క్వారంటైన్‌కు పంపారు. 


logo