శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 20:37:09

ఆభరణాల మోసం కుంభకోణంలో ఎమ్మెల్యే అరెస్ట్‌

ఆభరణాల మోసం కుంభకోణంలో ఎమ్మెల్యే అరెస్ట్‌

తిరువనంతపురం: ఆభరణాల మోసం కుంభకోణంలో ఒక ఎమ్మెల్యే అరెస్ట్‌ అయ్యారు. కేరళకు చెందిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ను క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో ఈ పార్టీ కూడా ఉన్నది. ఫ్యాషన్ గోల్డ్ జ్యువెలరీ గ్రూప్ చైర్మన్‌ అయిన కమరుద్దీన్‌ తమను కోట్లలో మోసం చేశారంటూ పలువురు పెట్టుబడిదారులు ఆయనపై పలు ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తొలుత కమరుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించింది. అనంతరం ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించింది. 


మరోవైపు ముదుపుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఫ్యాషన్‌ గోల్డ్‌ జ్యువెలరీ షాపులను  మూసివేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి కమరుద్దీన్‌కు వ్యతిరేకంగా వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇన్వెస్టర్లకు సుమారు వంద కోట్లు వరకు ఆయన ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్ట్‌ చేశారని ఎమ్మెల్యే కమరుద్దీన్‌ తెలిపారు. ఇన్వెస్టర్లకు వారి డబ్బులు తిరిగి వస్తాయని, తాను ఎలాంటి మోసం చేయలేదని ఆయన చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.