శనివారం 11 జూలై 2020
National - Apr 11, 2020 , 08:10:38

నిరాశ్రయుడి సామాజిక దూరం.. ఆశ్చర్యపోయిన పోలీసులు.. వీడియో

నిరాశ్రయుడి సామాజిక దూరం.. ఆశ్చర్యపోయిన పోలీసులు.. వీడియో

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ పేరు వినగానే అందరూ హడలిపోతున్నారు. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న ఈ వైరస్‌ వల్ల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా భయంతో కాలం గడుపుతున్నారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఉన్న ఆయుధం సామాజిక దూరం పాటించడం ఒక్కటే. 

కరోనా వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రజలకు చెవిన పడటం లేదు. కానీ ఓ నిరాశ్రయుడు మాత్రం సామాజిక దూరంపై అవగాహన కల్పించి పోలీసులను ఆశ్చర్యపరిచాడు. ఫుట్‌పాత్‌ మీద ఉండే ఆ వ్యక్తికి కరోనాపై అవగాహన ఉంది. అంతే కాదు ఈ వైరస్‌ బారిన పడొద్దనే స్పృహ అతనిలో ఉంది. అందుకే దగ్గరకు వస్తున్న పోలీసులను అప్రమత్తం చేసి, సామాజిక దూరం పాటించాలని పోలీసులకే పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

కేరళలోని కోజికొడ్‌లో పోలీసులు పర్యటిస్తూ.. నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి దుకాణం ముందు పడుకొని ఉన్నాడు. అతని వద్దకు ముగ్గురు పోలీసులు చేరుకున్నారు. ఆ నిరాశ్రయుడి పరిస్థితిని గమనించిన పోలీసులు అటు నుంచి ఫుడ్‌ ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌తో మళ్లీ అతని వద్దకు తిరిగి వచ్చారు. అయితే ఆ నిరాశ్రయుడి వద్దకు ఓ పోలీసు చేరుకుంటున్న సమయంలో సదరు వ్యక్తి అప్రమత్తమయ్యాడు. గబుక్కున లేచి.. తన వద్దకు రావొద్దంటూ సూచించాడు. కొంచెం దూరంలోనే ఆహారం పెట్టాలని ఆ వ్యక్తి రౌండప్‌ చేశాడు. దీంతో పోలీసులు అక్కడే ఫుడ్‌ ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌ పెట్టి వెళ్లిపోయారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని నిరాశ్రయుడు పోలీసులకు సూచించారు. అతని సూచనలతోనే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు ఇచ్చిన ఆహారాన్ని ఆకలితో ఉన్న నిరాశ్రయుడు వెంబడే తినేశాడు. ఈ వీడియోను స్థానికంగా ఉన్న ఓ షాపు యజమాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. logo