శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 12:43:03

మ‌ళ్లీ క‌ఠిన లాక్‌డౌన్ త‌ప్ప‌దేమో.. హెచ్చ‌రించిన కేర‌ళ మంత్రి

మ‌ళ్లీ క‌ఠిన లాక్‌డౌన్ త‌ప్ప‌దేమో.. హెచ్చ‌రించిన కేర‌ళ మంత్రి

 హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లో మ‌ళ్లీ క‌ఠిన‌మైన లాక్‌డౌన్ విధించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి కేకే శైల‌జా ఈ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఓన‌మ్ పండుగ త‌ర్వాత రాష్ట్రంలో మ‌ళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.  ఒక‌వేళ ఇదే విధంగా కేసులు పెరుగుతుంటే, అప్పుడు లాక్‌డౌన్ విధించ‌క త‌ప్ప‌దు అని ఆమె హెచ్చ‌రించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి .. రాష్ట్రంలో కోవిడ్‌19 ప‌రిస్థితి కీల‌కంగా ఉంద‌ని, ఒక‌వేళ నిబంధ‌న‌లు పాటించ‌కుంటే, అప్పుడు ప్ర‌జ‌లు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆమె అన్నారు. వాస్త‌వానికి కేర‌ళ‌లో తొలుత కేసులు బ‌య‌ట‌ప‌డ్డా.. క‌ట్టుదిట్ట‌మైన నిబంధ‌న‌ల‌తో ఆ కేసుల‌ను అదుపు చేశారు. అయితే ఇటీవ‌ల ఓన‌మ్ పండుగ స‌మ‌యంలో జ‌నం హ‌ద్దుమీరారు. దీనికి తోడు ఇటీవ‌ల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌లు కూడా ఎక్కువ‌య్యాయి. రాష్ట్రంలో వైర‌స్‌ పాజిటివ్ రేటు మ‌ళ్లీ 12 శాతం పెరిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటిస్తేనే వైర‌స్ అదుపులో ఉంటుంద‌ని, లేని ప‌క్షంలో లాక్‌డౌన్ విధించాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌ని మంత్రి శైల‌జా తెలిపారు. 20 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న‌వారిలోనే కేసులు అధికంగా న‌మోదు అవుతున్న‌ట్లు ఆమె చెప్పారు. 72 శాతం వృద్ధులు, 28 శాతం యువ‌త కోవిడ్‌తో మృతిచెందిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.