సోమవారం 18 జనవరి 2021
National - Dec 26, 2020 , 17:52:31

కేరళ జైలు శాఖపై కోర్టుకు వెళ్లే యోచనలో కస్టమ్స్‌

కేరళ జైలు శాఖపై కోర్టుకు వెళ్లే యోచనలో కస్టమ్స్‌

తిరువనంతపురం: సంచలనం రేపిన కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు మరో మలుపు తీసుకోనున్నది. ఆ రాష్ట్ర జైలు శాఖకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లాలని కస్టమ్స్‌ భావిస్తున్నది. ఈ కేసులో ముఖ్య నిందితురాలైన స్వప్న సురేష్‌ను తిరువనంతపురంలోని మహిళా జైలులో ఉంచారు. అయితే ఆమెను సందర్శించే వారి వెంట తమ అధికారిని పంపుతామని కస్టమ్స్‌ శాఖ జైలు అధికారులకు చెప్పింది. దీనికి జైలు అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నది. 

ఈ కేసులో ప్రభుత్వంలోని ప్రముఖుల పాత్ర ఉన్నందున తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉన్నదని నిందితురాలు స్వప్ప సురేష్‌ చెప్పినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. కొందరు జైలుకు వెళ్లి స్టేట్‌మెంట్‌ మార్చాలని బలవంతం చేస్తున్నట్లుగా ఆమె చెప్పారన్నారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో కేరళ రాష్ట్ర పోలీసులు, జైలు అధికారులు తమకు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మరో రాష్ట్రంలో కేసు విచారణ కోసం వచ్చే వారం కేరళ హైకోర్టును ఆశ్రయిస్తామని కస్టమ్స్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని జైలు అధికారి పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి