మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 18:27:47

ఒక్క ఏడాదిలో 230 కిలోల బంగారం స్మగ్లింగ్

ఒక్క ఏడాదిలో 230 కిలోల బంగారం స్మగ్లింగ్

తిరువనంతపురం : గత ఏడాది జూలై నుంచి కనీసం ఇప్పటివరకు 230 కిలోల బంగారం దేశంలోకి అక్రమంగా రవాణా జరిగింది. ఈ విషయాన్ని జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ) గురించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్య మిషన్‌లోని కొందరు ఉద్యోగుల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. గత ఏడాది దాదాపు 400 కిలోల బంగారం అక్రమ మార్గాల్లో మన దేశంలోకి చేరినట్లు ఎన్ఐఏ అధికారవర్గాలు చెప్తున్నాయి.

"ఒక సంవత్సరంలో కనీసం 13 ఇటువంటి సరుకులు మన దేశానికి వచ్చాయి. దౌత్యపర కారణంగా అవన్నీ ఎటువంటి తనిఖీ లేకుండా బయటకు వెళ్లిపోయాయి. వాటిలో కొన్ని సరుకులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారు అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేయగా, కస్టమ్స్ విభాగం ఇప్పటివరకు 13 మందిని పట్టుకుంది. వీరిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ కార్యదర్శి ఎం శివశంకర్, ప్రభుత్వ మాజీ ఐటి నిపుణుడు అరుణ్ బాలచంద్రన్ ఉన్నారు. గత వారం కస్టమ్స్ విభాగం శివశంకర్‌ను తొమ్మిది గంటలపాటు విచారించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో రెండో నిందితురాలు స్వప్న సురేష్ ఫోన్ జాబితాలో ఉన్న రాష్ట్ర మంత్రిని కూడా అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

ఈ కేసులో మూడో నిందితుడు ఫైసల్ ఫరీద్‌ను అరెస్టు చేసినట్లు దుబాయ్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఫైసల్ ఫరీద్ పై ఎన్ఐఏ ఇప్పటికే ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసినట్లుగా తెలిసింది. స్మగ్లింగ్ రాకెట్టులో ఫైసల్ ఫరీద్ కీలక ఆపరేటర్ అని ఎన్ఐఏ ఆరోపిస్తున్నది. త్రిస్సూర్‌కు చెందిన ఫరీద్.. దుబాయ్‌లో జిమ్, గ్యారేజీని నడుపుతున్నట్లు సమాచారం. అక్రమ రవాణా చేసిన బంగారాన్ని కనిపెట్టడానికి దర్యాప్తుదారులు భారీ ఆపరేషన్ ప్రారంభించి.. కోజిక్కోడ్‌లోని ఇద్దరు ఆభరణాల తయారీదారుల నుంచి 10 కిలోల బంగారాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. స్మగ్లింగ్ సిండికేట్‌లో భాగమైన చాలా మంది స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, అక్రమ రవాణా చేసిన బంగారాన్ని గుర్తించడం కష్టమని ఆయన అంగీకరించారు.

గత రెండు రోజులలో, అధికారులు స్వప్న సురేష్ కు చెందిన రెండు ఫ్లాట్లలో తనిఖీలు చేపట్టారు. తిరువనంతపురంలో మూడో నిందితుడు సందీప్ నాయర్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగిన ఎన్ఐఏ.. ఆయన వ్యాపార స్థాపనకు సంబంధించిన అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇలాఉండగా, బంగారం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్, ముస్లిం లీగ్.. ప్రస్తుతం మిన్నకుండి పోవడం పట్ల వారికి కూడా ఈ రాకెట్ తో సంబంధం ఉండి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


logo