శనివారం 11 జూలై 2020
National - Jun 06, 2020 , 02:52:05

బాధ భరించలేక.. ఆహారం లేక..

బాధ భరించలేక.. ఆహారం లేక..

  • కేరళ ఏనుగు శవపరీక్ష నివేదికలో వెల్లడి
  • నోట్లో పేలుడుతో గాయాలు
  • రెండువారాలు ఆహారం, నీళ్లు తీసుకోక నదిలో మునిగి మృతి

కొచ్చి: నోటి నిండా తీవ్రగాయాలు. దవడ వాచిపోయి భరించలేనంత బాధ. ఆహారం ముట్టుకోక.. నీళ్లు తాగే పరిస్థితిలేక నరకయాతన అనుభవిస్తూ గర్భిణి ఏనుగు కన్నుమూసింది. 14 రోజులు ఆకలితో అలమటించి చివరకు నదిలో మునిగిపోయి మృతిచెందినట్టు శవపరీక్షలో తేలింది. ఏనుగు గర్భాశయంలో రెండునెలల వయసున్న పిండం ఉన్నట్టు గుర్తించారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో 15 ఏండ్ల వయసున్న ఏనుగు పేలుడు పదార్థాలు నింపిన అనాస పండు తినబోగ అదిపేలడంతో నోటికి తీవ్రగాయాలై కన్నుమూసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారులు కళేబరానికి శవపరీక్ష నిర్వహించి శుక్రవారం నివేదికను ఇచ్చారు.

‘పేలుడు పదార్థాలు ఉన్న అనాస పండు తినడం వల్లే గర్భిణి ఏనుగు నోటిలో తీవ్ర గాయాలయ్యాయి. నోరంతా కుళ్లిపోయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది. నొప్పి భరించలేక దాదాపు రెండువారాల పాటు ఆహారం, నీరు తీసుకోవడాన్ని ఆపేసింది. ఆకలితో అలమటించి క్షీణించిపోయింది. బలహీనపడి చివరకు నదిలోనే కుప్పకూలి మునిగిపోయింది. నీటిలో మునిగాక ఊపిరితిత్తులు పాడై ఆ వెంటనే ఏనుగు మృతిచెందింది’ అని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఏనుగు మృతి కేసులో శుక్రవారం ఒకరిని అరెస్టు చేశారు.


logo