బుధవారం 03 జూన్ 2020
National - Apr 01, 2020 , 13:31:00

పెళ్లి కంటే కరోనా రోగులే ముఖ్యం.. అందుకే పెళ్లి వాయిదా

పెళ్లి కంటే కరోనా రోగులే ముఖ్యం.. అందుకే పెళ్లి వాయిదా

పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. వివాహం అనగానే ప్రతి ఒక్క అమ్మాయికి తన కలల రాకుమారుడు గుర్తుకు వస్తాడు. ఆ రాకుమారుడితో ఒక్కటయ్యేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. పెళ్లి ముహుర్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ఆ ముహుర్త సమయానికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆ బాధ వర్ణించలేనిది. కానీ ఈ వైద్యురాలు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. బాధపడలేదు. విపత్కర సమయంలో రోగులకు సేవ చేస్తున్నందుకు సంతోషపడుతోంది. పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు.. కానీ రోగికి మాత్రం జబ్బును నయం చేసే సమయం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. ఆ సమయం మించిపోతే రోగిని బతికించలేం. కాబట్టి రోగులే తనకు ముఖ్యం.. అందుకే పెళ్లిని వాయిదా వేసుకున్నానని కేరళకు చెందిన ఓ వైద్యురాలు చెబుతోంది. 

కేరళకు చెందిన డాక్టర్‌ షిఫా ఎం మహ్మమద్‌(23) వృత్తిరీత్యా హౌస్‌ సర్జన్‌. ఈమె కన్నూరులోని పరియరం మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెకు దుబాయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో మార్చి 29న వివాహం జరగాల్సి ఉండే. అయితే షిఫా పని చేస్తున్న ఆస్పత్రిలో మొదట్లో తక్కువగానే కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకు కేసులు అధికంగా నమోదు కావడంతో.. పరియరం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా రోగులకే కేటాయించారు. దీంతో ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు.. పూర్తి సమయంలో విధులకే కేటాయించాల్సి వచ్చింది. కంటి మీద కునుకు లేకుండా వైద్యులు, నర్సులు పని చేస్తున్నారు. కరోనా పేషెంట్లకు నిర్విరామంగా చికిత్స అందిస్తున్నారు. కేరళలో మొత్తం 234 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. 

అయితే షిఫాను పెళ్లాడబోయే బిజినెస్‌మెన్‌ కూడా ఆమెతో ఏకీభవించారు. సామాజిక సేవలో నిమగ్నమైన షిఫా నిర్ణయమే తన నిర్ణయమని అతను స్పష్టం చేశారు. కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిన తర్వాతే తమ వివాహ వేడుకను జరుపుకుంటామని ఈ జంట పేర్కొంది. 


logo