సోమవారం 25 జనవరి 2021
National - Dec 31, 2020 , 11:43:37

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ కేర‌ళ అసెంబ్లీలో తీర్మానం

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ కేర‌ళ అసెంబ్లీలో తీర్మానం

హైద‌రాబాద్‌:  కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ కేర‌ళ అసెంబ్లీలో ఇవాళ తీర్మానం ఆమోదించారు.  ప్ర‌త్యేకంగా ఇవాళ ఒక రోజు అసెంబ్లీ నిర్వ‌హించారు.  రైతుల నిజ‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వం మూడు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆ తీర్మానంలో కోరారు. ఒక‌వేళ ఇదే త‌ర‌హా ఆందోళ‌న కొన‌సాగితే, దాని వ‌ల్ల కేర‌ళ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి ఆహార స‌ర‌ఫ‌రా నిలిచిపోతే, అప్పుడు క‌చ్చితంగా కేర‌ళ‌లో ఆక‌లి స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు.  త‌క్ష‌ణ‌మే మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని సీఎం విజ‌య‌న్ కేంద్రాన్ని కోరారు.  తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడుతూ.. మోదీ స‌ర్కార్ రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నారు.  ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ ఆ తీర్మానానికి మ‌ద్ద‌తు తెలిపింది. 

కేర‌ళ సీఎం విజ‌య‌న్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజాగోపాల్ వ్య‌తిరేకించారు. కాంగ్రెస్ పార్టీ త‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఇలాంటి రైతు చ‌ట్టాల‌నే ప్ర‌తిపాదించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని సీపీఎం చూసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు.  రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రికాదు అని రాజాగోపాల్ తెలిపారు.  


logo