మంగళవారం 31 మార్చి 2020
National - Feb 11, 2020 , 13:01:55

ఆప్‌కే స‌ర్కార్‌.. కేజ్రీవాల్ హ్యాట్రిక్‌

ఆప్‌కే స‌ర్కార్‌.. కేజ్రీవాల్ హ్యాట్రిక్‌

హైద‌రాబాద్‌:  ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమ్ ఆద్మీకే ప‌ట్టం క‌ట్టారు.  సీఎం కేజ్రీవాల్‌కే మ‌ళ్లీ పీఠాన్ని అప్ప‌గించారు.  వ‌రుస‌గా మూడ‌వ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.  ఈనెల 8వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మ‌ళ్లీ ఘ‌న విజ‌యం సాధించింది.  2014లో గెలిచిన కేజ్రీ.. అనూహ్య రీతిలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.  49 రోజుల ప్ర‌భుత్వాన్ని ఆయ‌న వ‌దులుకున్నారు.  ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి మ‌ళ్లీ 2015లో పూర్తి మెజారిటీ సాధించారు.  అయితే గ‌త అయిదేళ్ల‌లో కేజ్రీవాల్‌.. ఢిల్లీని అభివృద్ధి ప‌థంలో న‌డిపారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు.  దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న వెంటే నిలిచారు.  2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కేజ్రీవాల్‌ను గెలిపించారు. 

ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ఉత్కంఠ రీతిలో ప్ర‌చారం సాగింది.  బీజేపీ, ఆమ్ ఆద్మీ మ‌ధ్య .. దూష‌ణల ప‌ర్వం కొన‌సాగింది. ఓ ద‌శ‌లో విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు కూడా చోటుచేసుకున్నాయి. ఢిల్లీని చేజిక్కించుకోవాల‌నుకున్న బీజేపీ.. ప్ర‌చారం కోసం త‌మ మేటి టీమ్‌ను రంగంలోకి దింపింది.  కానీ కేజ్రీ మాత్రం ఒంట‌రిగానే త‌న ఎజెండాతో ప్ర‌జ‌ల ముందుకు వెళ్లారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా షెహీన్‌బాగ్‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల చుట్టే బీజేపీ త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగించింది.  కేజ్రీవాల్ మాత్రం అడ‌పాద‌డ‌పా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తూ త‌న ల‌క్ష్యం వైపుగా దూసుకువెళ్లారు. 

ఈసారి ఢిల్లీలో 62.59 శాత‌మే ఓటింగ్ న‌మోదు అయ్యింది. ఓటింగ్ శాతాన్ని కూడా ఒక రోజు ఆల‌స్యంగా వెల్ల‌డించారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌తో ఏదైనా జిమ్మిక్కు చేసి ఉంటార‌ని ఆప్‌ ఆరోప‌ణ‌లు చేసింది. కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లే ఆప్ చెల‌రేగిపోయింది.  తాజా ఎన్నిక‌ల్లో ఆప్‌కు 52 శాతం, బీజేపీకి 47 శాతం ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తోంది. నేను మీ కుమారుడిని అనుకుంటేనే మాకు ఓటు వేయండి, నేను ఉగ్ర‌వాది అనుకుంటే ఓటు వేయ‌కండి అంటూ కేజ్రీ ప్ర‌చార స‌మ‌యంలో పేర్కొన్నారు. 

జాతీయ పార్టీగా ఎద‌గాల‌నుకుంటున్న ఆప్‌కు ఇది మంచి విక్ట‌రీ. 2013లో ప్రారంభ‌మైన ఆమ్ ఆద్మీ జ‌ర్నీ.. ఇక ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్క‌నున్న‌ది.  అన్నా హ‌జారాతో అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం సాగించిన కేజ్రీ.. రాజ‌కీయ ప్ర‌వేశంతో మ‌రింత‌ చైత‌న్యాన్ని తీసుకువ‌చ్చారు. మ‌ఫ్ల‌ర్ వేసుకునే నేత నుంచి ఆయ‌న త‌న లుక్‌ను మార్చేసుకున్నారు. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ నుంచి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కేజ్రీ.. 1995లో ఇండియ‌న్ రెవ‌న్యూ స‌ర్వీస్‌ ఉద్యోగంలో చేరారు. 2001లో ఆ ఉద్యోగానికి ఆయ‌న రాజీనామా చేశారు. 

రైట్ టు ఇన్ఫ‌ర్మేష‌న్ యాక్టును తీసుకువ‌చ్చేందుకు కేజ్రీవాల్ పోరాటం చేప‌ట్టారు.  2005లో దాని కోసం భారీ ఉద్యమాన్ని న‌డిపారు. 2006లో ఆయ‌న‌కు రామ‌న్ మెగ‌స్సేసే అవార్డు ద‌క్కింది.  లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హ‌జారేతో జ‌త‌క‌ట్టిన కేజ్రీ.. ఆ త‌ర్వాత పొలిటిక‌ల్ ఎంట్రీతో త‌న స్టేట‌స్ మార్చుకున్నారు. మొద‌ట్లో మోదీపై నిప్పులు చెరిగినా.. నిదానంగా ఆ విమ‌ర్శ‌ల‌ను త‌గ్గించారు. తాజాగా ఆర్టిక‌ల్ 370 విష‌యంలో కేంద్రానికి కేజ్రీ మ‌ద్ద‌తు ఇచ్చారు.  

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఒక రోజు ముందు అయోధ్యలో రామాల‌య నిర్మాణం కోసం ట్ర‌స్టు ఏర్పాటు చేస్తున్న ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌క‌ట‌నను ఆమ్ ఆద్మీ స్వాగ‌తించింది.  దాంట్లో రాజ‌కీయ కోణాన్ని చూడ‌డం లేద‌ని,  అదో మంచి నిర్ణ‌య‌మ‌ని, ప్ర‌ధాని ఎప్పుడూ ఇలాంటి మంచి ప్ర‌క‌ట‌న‌లు చేయాల‌ని సీఎం కేజ్రీవాల్ పేర్కొన‌డం గ‌మ‌నించద‌గ్గ విష‌యం. తాజా స‌మాచారం అందిన మేర‌కు.. కౌంటింగ్‌లో ఆమ్ ఆద్మీ సుమారు 50 సీట్ల‌ల్లో ఆధిక్యంలో ఉన్న‌ది.  20 స్థానాల‌తో బీజేపీ రెండ‌వ స్థానంలో కొన‌సాగుతున్న‌ది. 


logo
>>>>>>