ఆదివారం 23 ఫిబ్రవరి 2020
కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారానికి ప్రధానోపాధ్యాయులకు ఆహ్వానం

కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారానికి ప్రధానోపాధ్యాయులకు ఆహ్వానం

Feb 15, 2020 , 10:39:35
PRINT
కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారానికి ప్రధానోపాధ్యాయులకు ఆహ్వానం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాంలీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రజలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్‌ ఆహ్వానించిన విషయం విదితమే. తాజాగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌, కరిక్యూలమ్‌ కోఆర్డినేటర్స్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఆప్‌ ప్రభుత్వంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చారు కేజ్రీవాల్‌. నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇక కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు.

అయితే, కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరవుతారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ ఆదివారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభానికి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది నూతన ఎమ్మెల్యేలను కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు పంపామని గోపాల్‌ రాయ్‌ పీటీఐకి తెలిపారు. 


logo