శనివారం 29 ఫిబ్రవరి 2020
కేంద్రాన్ని నొప్పించకుండా.. కేజ్రీవాల్‌ ప్రమాణం

కేంద్రాన్ని నొప్పించకుండా.. కేజ్రీవాల్‌ ప్రమాణం

Feb 14, 2020 , 03:01:50
PRINT
కేంద్రాన్ని నొప్పించకుండా.. కేజ్రీవాల్‌ ప్రమాణం
  • ఇతర రాష్ర్టాల సీఎంలను, పార్టీల నేతలను

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినప్పటికీ కేంద్రంతో వైరం పెట్టుకునే ఉద్దేశం తమకు లేదన్న సంకేతాలను ప్రమాణస్వీకారం సందర్భంగా కేజ్రీవాల్‌ పంపనున్నారు. ఈ మేరకు ఈ నెల 16న జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర రాష్ర్టాల సీఎంలను, బీజేపీయేతర నాయకులను ఆహ్వానించడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఢిల్లీ శాఖ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ఈ నెల 16న ప్రమాణం చేయనున్నారు. అయితే సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఇతర రాష్ర్టాల సీఎంలను, ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానించడంఆనవాయితీ. కానీ కేజ్రీవాల్‌ మాత్రం ఎవరినీ ఆహ్వానించడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ర్టాల సీఎంలను, నాయకులను పిలువడం ద్వారా తాము కేంద్రంతో వైరంగా ఉంటామనే సంకేతాలు వెలువడే ప్రమాదముంది. అందుకే పిలువడం లేదు. ఇదే సమయంలో ఎవరిపట్ల తమకు దురుద్దేశం కూడా లేదు’ అని పేర్కొన్నారు.


అయితే ప్రొటోకాల్‌ ప్రకారం ఢిల్లీకి చెందిన ఏడుగురు బీజేపీ ఎంపీలను, ఇటీవల ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను పిలిచే అవకాశముందని వివరించారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు ఆప్‌ కార్యాలయం వద్ద అందరి దృష్టిని ఆకర్షించిన బాలుడు ఆవ్యాన్‌ తోమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆప్‌ ఆహ్వానించింది. కేజ్రీవాల్‌ ఎలాగైతే స్వెటర్‌ ధరించి, మఫ్లర్‌ను మెడకు చుట్టుకొని, ఆప్‌ టోపీతో కనిపిస్తారో.. తోమర్‌ కూడా ఎన్నికల ఫలితాల రోజు అలాంటి వస్త్రధారణతో కనిపించి అందరి హృదయాలను దోచుకున్నాడు. చివరికి కేజ్రీవాల్‌లాగానే కండ్ల అద్దాలు, మీసాలను (మేకప్‌) కూడా కలిగి ఉన్న ఆ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడిని కేజ్రీవాల్‌ ప్రమాణానికి ఆహ్వానించామని ఆప్‌ వర్గాలు తెలిపాయి.

logo