గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 11, 2020 , 02:06:27

కేంద్రంపై కేసీఆర్‌ పోరాడాలి

కేంద్రంపై కేసీఆర్‌ పోరాడాలి

  • వ్యవసాయ, విద్యుత్‌ బిల్లులను వ్యతిరేకించాలి 
  • సీఎంకు మద్దతిస్తాం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని  

కూసుమంచి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జరిగే పోరాటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. అందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని  వెల్లడించారు. మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో శాసనసభలో తీర్మానించడం సంతోషకరమన్నారు. రైతులకు అండగా నిలువటం కోసం కేంద్రంపై పోరాటాలకు కేసీఆర్‌ నాయకత్వం వహించాలని విజ్ఞప్తిచేశారు.

సంస్కరణలతో నష్టమే

కేంద్ర వ్యవసాయ బిల్లులు బహుళజాతి కంపెనీలకు ప్రయోజనకరంగా ఉన్నాయని తమ్మినేని విమర్శించారు. చట్టంతో రైతులకు లాభం లేకపోగా తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రతి రైతుకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్కరణలు కూడా అందరికీ నష్టం కలిగించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ర్టాల పరిధిలోని అంశాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవటం రాష్ర్టాల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. ఉద్యమానికి కలిసి వచ్చేవారిని కలుపుకొని కేంద్రంపై పోరాటం సాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా రైతు సంఘం నాయకులు బత్తుల లెనిన్‌, పాలేరు నియోజకవర్గం ఇంచార్జి బండి రమేశ్‌ పాల్గొన్నారు.