మంగళవారం 26 జనవరి 2021
National - Dec 26, 2020 , 13:46:58

క‌శ్మీర్‌ను వ‌ణికిస్తున్న 'చిల్లై క‌ల‌న్'‌

క‌శ్మీర్‌ను వ‌ణికిస్తున్న 'చిల్లై క‌ల‌న్'‌

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో చలి రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. క‌శ్మీర్‌లో గ‌త 15 రోజులుగా, జ‌మ్ములో గ‌త వారం రోజులుగా చలి తీవ్ర‌త ఎక్కువ‌య్యింది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి అడుగు బ‌య‌ట పెట్టాలంటే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. శ‌నివారం కూడా అక్క‌డి క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు ఘ‌నీభ‌వ‌న స్థానానికి (ఫ్రీజింగ్ పాయింట్‌కు) దిగువ‌నే ఉన్నాయి. ఇదిలావుంటే రాబోయే రోజుల్లో క‌శ్మీర్‌లో సాధార‌ణ వ‌ర్ష‌పాతంతోపాటు మంచు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 12న‌ మంచు కురిసిన‌ప్ప‌టి నుంచి కశ్మీర్‌లో వాతావ‌ర‌ణం పొడిగా, చ‌ల్ల‌గా ఉన్న‌ద‌ని, అక్క‌డ‌ రాత్రి ఉష్ణోగ్ర‌త‌లు ఫ్రీజింగ్ పాయింట్ కంటే చాలా త‌క్కువగా న‌మోద‌వుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

ఇక జ‌మ్ముక‌శ్మీర్ వేస‌వి రాజ‌ధాని అయిన శ్రీన‌గ‌ర్‌లోనూ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త మైన‌స్‌ 3.7 డిగ్రీలుగా ఉన్న‌ద‌ని అధికారులు చెప్పారు. అయితే శుక్ర‌వారం న‌మోదైన మైన‌స్ 4.3 డిగ్రీల‌తో పోల్చితే శనివారం కొంత చ‌లి ప్రభావం త‌గ్గింద‌న్నారు. ఇక ద‌క్షిణ క‌శ్మీర్లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశం ప‌హ‌ల్గామ్‌లో క‌నిష్ట ఉష్ణోగ్ర‌త మైన‌స్ 4.5 డిగ్రీలుగా ఉన్న‌ది. గ‌త రాత్రి న‌మోదైన మైన‌స్ 5.9 డిగ్రీల కంటే ఇప్పుడు ప‌రిస్థితి కొంత మెరుగైంది. ఉత్త‌ర క‌శ్మీర్లోని గుల్మార్గ్‌లోగ‌ల ఫ్యామ‌స్ స్కై రిసార్ట్ ప్రాంతంలో క‌శ్మీర్ వ్యాలీలోనే అత్యంత త‌క్కువ‌గా మైన‌స్ 6.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

అదేవిధంగా ఖాజీగండ్‌లో మైన‌స్ 4 డిగ్రీలు, కుప్వారాలో మైన‌స్ 3.6 డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో మైన‌స్ 4 డిగ్రీల క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో అతిశీత‌ల ప‌రిస్థితి అయిన 'చిల్లై క‌ల‌న్' కొన‌సాగుతుండ‌టమే ఇంత‌టి చ‌లికి కార‌ణ‌మ‌ని వాతావ‌ర‌ణ విభాగం అధికారులు తెలిపారు. డిసెంబ‌ర్ 21న ప్రారంభ‌మైన ఈ చిల్లై క‌ల‌న్ జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు 40 రోజుల‌పాటు కొన‌సాగుతుంద‌ని చెప్పారు. ఆ తర్వాత 20 రోజుల‌పాటు 'చిల్లై కుర్ద్' (త‌క్కువ చ‌లి), ఆ త‌ర్వాత 10 రోజుల‌పాటు 'చిల్లై బ‌చ్చ' (పిల్ల చ‌లి) ప‌రిస్థితులు కొన‌సాగుతాయ‌న్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo