శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:55:32

కర్ణాటకలో 15 రోజుల్లో రెట్టింపు కానున్న కరోనా కేసులు

కర్ణాటకలో 15 రోజుల్లో రెట్టింపు కానున్న కరోనా కేసులు

బెంగళూరు : రాబోయే 15 నుంచి 30 రోజుల్లో కర్ణాటకలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చొని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి శ్రీరాములు అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ట్విట్టర్‌ ద్వారా ఆయన స్పందిస్తూ... రాబోయే రెండు నెలలు మహమ్మారిని పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుందన్నారు. అయితే ఎటువంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండటానికి కోవిడ్‌-19 నిబంధనలను పాటించాలన్నారు. శనివారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 36,216 కు చేరుకుంది. కోవిడ్‌-19 కారణంగా 613 మంది మరణించారు. వ్యాధి నుంచి 14,716 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

గడిచిన కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బెంగళూరుతో పాటు రూరల్‌ జిల్లాల్లో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధించనుంది. రాష్ట్రంలో ప్రతీరోజు 2 వేల కరోనా కేసులు నమోదు అవుతున్నాయని కావునా ప్రజలు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా శ్రీరాములు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో భయపడాల్సిన అంశం కానీ, అపనమ్మకం కానీ అవసరం లేదన్నారు.


logo