బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 20, 2020 , 21:42:03

హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్‌ రద్దు

హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్‌ రద్దు

బెంగళూరు : హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిపై కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నది. హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపేవారి లైసెన్స్‌ రద్దు చేయనున్నారు. ఈ కఠిన నిర్ణయాలు ఇవాల్టి నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనను ఉల్లంఘించినవారికి జరిమానా విధించడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెన్షన్‌లో పెట్టనున్నారు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం, వాహనం నడిపే ప్రతి వ్యక్తి  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న హెల్మెట్‌ ధరించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించినవారికి రూ.1,000 జరిమానా విధిస్తారు. అలాగే లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెన్షన్ చేయాలని చట్టం సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం ఈ జరిమానా మొత్తాన్ని రూ.500 కు తగ్గించింది. మూడు నెలల సస్పెన్షన్ నిబంధనను ఇంతవరకు అమలులోకి తీసుకురాలేదు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం రాష్ట్రంలో అత్యధిక రహదారి ఉల్లంఘనలలో ఒకటిగా ఉన్నందున.. ఇలాంటి డ్రైవింగ్‌ను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత ఈ కొత్త ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 59.9 లక్షలు సహా 1.65 కోట్ల రిజిస్టర్డ్ ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.