బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:23:35

మూడు నెలల్లో 40వేల రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌లు

మూడు నెలల్లో 40వేల రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌లు

బళ్లారి : ఆడ, మగ ఒక్కటయ్యే అద్భుతమైన వేదిక వివాహం. జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. కరోనా మహమ్మారితో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుపుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. వైరస్‌ సోకే ప్రమాదం ఉండడంతో అటు ప్రభుత్వం పరిమిత సంఖ్యలో జరుపుకోవాలని ఆదేశిస్తున్నది. అతిక్రమిస్తే లక్షల్లో ఫైన్లు విధించినా దాఖలాలూ లేకపోలేదు. దీంతో పలువురు రిజిస్టర్‌ మ్యారేజీల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ మధ్య కర్ణాటక బళ్లారి జిల్లాల్లో 40వేల కంటే ఎక్కువగా రిజిస్టర్‌ అయ్యాయి. కరోనా వైరస్‌ సంక్రమణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించగా.. ఫంక్షన్‌ హాళ్లు మూతపడ్డ విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌, అనంతరం షరతులతో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వ నిబంధనలతో ఎక్కువ మంది రిజిస్టర్‌ మ్యారేజీ వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో గత మూడు నెలల్లో కర్ణాటకలో రిజిస్టర్‌ వివాహ నమోదులో భారీ పెరుగుదల నమోదైంది. సుమారు 40వేలకుపైగా వివాహాలు నమోదయ్యాయి.  ఇది రాష్ట్రంలోనే అత్యధికమని పలువురు అధికారులు తెలిపారు.  అంతకు ముందు పెద్ద పెద్ద వేదికలు, హాళ్లలో వివాహాలకు అనుమతి ఉండడంతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగే. దీంతో రిజిస్టర్‌ మ్యారేజీలు తక్కువగా ఉండేవి. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మందికి తప్పనిసరి పరిస్థితుల్లో రిజిస్టర్ చేసుకోవడం మినహా వేరే గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరంతో పోల్చితే, ఈ యేడాది వివాహ రిజిస్ట్రేషన్లు అధికంగా ఉన్నాయని జిల్లా వివాహ రిజిస్టర్ అధికారి ఒక సీనియర్ అధికారి తెలిపారు.

వివాహాలు నిర్వహించేందుకు అనుమతి ఉన్నా.. నిబంధనలుండడం, ప్రయాణాలు చేయాల్సి వస్తుండడంతో కొవిడ్‌-19 వైరస్‌ సోకే ప్రమాదం ఉండగా ఎక్కువ మంది రిజిస్టర్ వివాహం వైపు మొగ్గు చూపుతున్నారు. 2019లో బళ్లారిలో 1,141 వివాహాలు నమోదు కాగా, ప్రస్తుతం మూడు నెలల్లోనే 12,300 వివాహాలు రిజిస్టర్‌ అయ్యాయి. ‘ఆంక్షలు ఉన్నప్పటికీ, జిల్లా కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో పలువురి వీవీఐపీ వివాహాలు, పలు గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ వివాహాలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. అయినా ఎక్కువ వరకు రిజిస్టర్‌ మ్యారేజీలు నమోదు చేయబడ్డాయని’ అధికారి పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా బళ్లారికి చెందిన ఓ జంట మాట్లాడుతూ ‘మేం 50 మంది బంధువుల మధ్య వివాహాన్ని నిర్వహించుకోవాలని అనుకున్నామని, దీంతో బంధువుల్లో చీలికకు దారి తీస్తుందని భావించి, నిర్ణయించిన తేదీన రిజిస్టర్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. మహమ్మారి నుంచి కదుట పడ్డాక అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo