బుధవారం 03 జూన్ 2020
National - Apr 09, 2020 , 21:52:16

నర్సును చూసి బిడ్డ కన్నీరు.. చలించిన కర్ణాటక సీఎం.. వీడియో

నర్సును చూసి బిడ్డ కన్నీరు.. చలించిన కర్ణాటక సీఎం.. వీడియో

బెంగళూరు : ఆమె వృత్తిరీత్యా నర్సు. రోజు వందల మందికి ఆమె సేవలు అవసరం. ఆస్పత్రిలో నర్సు లేకపోతే నడవనే నడవదు. అలాంటి నర్సుకు ఇల్లు కూడా ముఖ్యమే. కానీ ఆమె పూర్తి స్థాయి సమయాన్ని ఆస్పత్రికే కేటాయిస్తోంది. ఎందుకంటే.. కరోనా రోగులకు సేవలందించడంలో ఆ నర్సు నిమగ్నమై పోయింది. మృత్యువుతో పోరాడుతున్న కరోనా రోగులను బతికించుకునేందుకు ఆమె అహర్నిశలు కష్టపడుతోంది. కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్నారు. 

అయితే ఆ నర్సు ఇంటికి వెళ్లక 15 రోజులు అవుతోంది. దీంతో ఆమె బిడ్డ తన తండ్రిని తీసుకుని ఆస్పత్రికి వద్దకు వచ్చింది. అమ్మా ప్లీజ్‌ కమ్‌ బ్యాక్‌ అంటూ నర్సు వృత్తిలో ఉన్న తల్లిని చూసి బిడ్డ బోరున విలపించింది. గుక్క పట్టి ఏడ్చింది. బిడ్డ కన్నీటిని చూసి తల్లి కూడా బోరుమన్నది. ఒకరికొకరు దూరంగానే ఉండి ఏడుస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తల్లీబిడ్డల కన్నీరుపై కర్ణాటక సీఎం యెడియూరప్ప కూడా స్పందించి.. ఆ వీడియోను తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. 

సుగంధ అనే మహిళ.. బెళగావి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే సుగంధకు ఐసోలేషన్‌ వార్డుల్లో డ్యూటీ వేశారు. దీంతో పదిహేను రోజుల నుంచి ఆమె ఇంటికి వెళ్లలేదు. ఈ సమయంలో తన తల్లిని చూడాలని బిడ్డకు అనిపించింది. నిన్న ఆస్పత్రి వద్దకు వచ్చిన బిడ్డ తన తల్లిని చూసి విలపించింది. 

అయితే ఈ తల్లీబిడ్డల రోదనపై కర్ణాటక సీఎం యెడియూరప్ప ట్వీట్‌ చేశారు. ఆ నర్సుకు సీఎం ఫోన్‌ చేసి ధైర్యాన్ని చెప్పారు. మీరు మీ బిడ్డను వదిలిపెట్టి చిత్తశుద్ధితో విధులకు హాజరవుతున్నారు. అనేక ఇబ్బందుల మధ్య మీరు కష్టపడి పని చేస్తున్నారు. మీ బిడ్డ ఏడుపును టీవీలో చూశాను. మీకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కృషికి తగిన ఫలితం ఉంటుందని నర్సుతో సీఎం మాట్లాడారు. 


logo