శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 20:55:48

వైద్యుల రక్షణ కోసం ‘ఐసీయూ టెలికార్డ్‌’

వైద్యుల రక్షణ కోసం ‘ఐసీయూ టెలికార్డ్‌’

బెంగళూరు: కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల రక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఐఎస్‌సీఓ(సిస్కో) తయారు చేసిన ‘ఐసీయూ టెలికార్డ్‌’ను గురువారం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు ఆవిష్కరించారు. వైఫై టెక్నాలజీ సహాయంతో పనిచేసే ఈ టెలికార్డ్‌ ఉంటే వైద్యులు ఐసోలేషన్‌ వార్డులు, కొవిడ్‌ ఐసీయూ లోపల ఉండాల్సిన అవసరముండదు. కాగా, రాష్ట్రంలోని విక్టోరియా అండ్‌ కేసీ జనరల్ దవాఖానలో ఐసీయూ టెలికార్డును ఏర్పాటు చేశారు. 

‘ఈ సాంకేతిక పరిజ్ఞానం మన వైద్యుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో దీనిపై చర్చించి మేం నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి, విక్టోరియా అండ్‌ కేసీ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేశాం.’ అని మంత్రి శ్రీరాములు తెలిపారు. ఇదిలా ఉండగా, కరోనావైరస్ పరీక్ష లేకుండా మార్చురీలనుంచి మృతదేహాలను పంపించడం లేదని వచ్చిన ఫిర్యాదులనుద్దేశించి శ్రీరాములు మాట్లాడారు. ‘నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో నిపుణులు ఈ విషయాన్నే చర్చించారు. టెస్టింగ్‌ ల్యాబ్‌ల సంఖ్యలను పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. అలాగే, అన్ని జిల్లాల్లో ప్లాస్మా చికిత్స చేసేందుకు కూడా మేం ఆలోచిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo