బుధవారం 27 జనవరి 2021
National - Dec 23, 2020 , 17:09:32

కర్ణాటక హైకోర్టులో యెడియూరప్పకు ఎదురుదెబ్బ

కర్ణాటక హైకోర్టులో యెడియూరప్పకు ఎదురుదెబ్బ

బెంగళూరు : ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. బెంగళూరు నగరంలోని బెల్లెందూర్ ప్రాంతంలో అక్రమంగా డీ-నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో యెడియూరప్పపై కేసు నమోదైంది. 2013 లో వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో యోడ్డీపై 2015 ఫిబ్రవరిలో కేసు నమోదైంది.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప 2006 లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెల్లెందూర్‌ ప్రాంతంలోని భూమిని అక్రమంగా డీ-నోటిఫికేషన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండేపై ఉన్న కేసును రద్దు చేశారు. దీని తరువాత దేశ్‌పాండే కూడా నిందితుడు కావడంతో అదే కారణాలను వాదిస్తూ యడియూరప్ప కోర్టును ఆశ్రయించారు. అయితే, యడియూరప్ప అభ్యర్ధనను జస్టిస్ జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

ఇలాఉండగా, హైకోర్టు ఉత్తర్వులపై స్పందించిన కాంగ్రెస్.. యడియూరప్పపై తీవ్రంగా విరుచుకుపడింది. ఇప్పుడు బీజేపీ అతడిపై చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించింది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్ప ఒక సెకను కూడా ముఖ్యమంత్రి  పీఠంపై కొనసాగే హక్కు లేదని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి, కర్ణాటక పార్టీ ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. యడియూరప్ప స్వయంగా సీఎం పీఠం  నుంచి వైదొలగడం గానీ, ప్రధాని మోదీ ఆయనను తొలగించడం గానీ చేసినప్పుడే బీజేపీపై మాకు నమ్మకం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo