e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home Top Slides యెడ్డీ రాజీనామా

యెడ్డీ రాజీనామా

  • ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయిన రోజే వైదొలగిన కర్ణాటక సీఎం
  • గవర్నర్‌గా వెళ్లను, క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని వెల్లడి
  • ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్‌ జోషి, బీఎల్‌ సంతోష్‌, సీటీ రవి

బెంగళూరు, జూలై 26: కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. తన ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండేండ్లు అయిన రోజునే ఆయన వైదొలిగారు. ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా విధాన సౌధలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేయనున్నట్టు గద్గదస్వరంతో తెలిపారు. 20 నిమిషాలు ప్రసంగించిన ఆయన పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. రాజీనామా చేయాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని తెలిపారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగానే వైదొలిగానని చెప్పారు. తన రాజీనామా లేఖను రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు అందజేశారు. అనంతరం యెడియూరప్ప రాజీనామాను ఆమోదించడంతో పాటు ఆయన సారథ్యంలోని క్యాబినెట్‌ను రద్దు చేస్తున్నట్టు గవర్నర్‌ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తదుపరి సీఎంగా ఎవర్నీ సిఫారసు చేయలేదని యెడియూరప్ప తెలిపారు. రాజకీయ రిటైర్మెంట్‌ ప్రసక్తే లేదని, గవర్నర్‌ పదవిని స్వీకరించబోనని స్పష్టం చేశారు. క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. రెండేండ్ల పాలనలో ఎదురైన సవాళ్లను అగ్నిపరీక్షగా అభివర్ణించారు.

లింగాయత్‌ వర్గానికి బలమైన నేత..
78 ఏండ్ల యెడియూరప్ప… నాలుగుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. దక్షిణాదిలో బీజేపీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేత. బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. అయితే ఆయన పలు అంశాల్లో పలువురు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన పనితీరుపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యెడియూరప్పను మార్చాలని బీజేపీ నిర్ణయించిందని చెబుతున్నారు.

- Advertisement -

ఎప్పుడూ పూర్తికాలం పదవిలో లేరు
యెడియూరప్ప 2007 నుంచి నాలుగుసార్లు సీఎం అయినా ఎప్పుడూ పూర్తికాలం పదవిలో లేరు. రెండు దశాబ్దాలుగా కర్ణాటకలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉన్న ఆయన ఇప్పుడు కూడా అర్ధాంతరంగానే తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన ఆయన తర్వాత కొన్నాళ్లు హార్డ్‌వేర్‌ స్టోర్‌ నిర్వహించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒడిదొడుకులను అధిగమిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. యెడ్డీ రాజీనామాకు నిరసనగా ఆయన నియోజకవర్గం శికారిపురలో మద్దతుదారులు బంద్‌ నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నేతలకు బలవంతంగా రిటైర్మెంట్లు ఇస్తున్న ప్రధాని మోదీకి యెడియూరప్ప మరో బాధితుడు అని కాంగ్రెస్‌ విమర్శించింది.

రేసులో పలువురి పేర్లు
యెడియూరప్ప రాజీనామాతో తదుపరి సీఎం ఎవరన్న చర్చ సాగుతున్నది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, జాతీయ ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హెగ్డే కగేరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ ఎస్‌ బొమ్మయ్‌, రెవెన్యూ మంత్రి ఆర్‌ ఆశోక, డిప్యూటీ సీఎం సీఎన్‌ అశ్వత్థ నారాయన్‌ కూడా పోటీలో ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో సీఎంగా పనిచేసిన పరిశ్రమల మంత్రి జగదీశ్‌ షెట్టర్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. తదుపరి సీఎం ఎవరనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ శాసనస భా పక్షం నిర్ణయిస్తాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana