లక్నో : తన కుమార్తెకు ప్రియుడితో వివాహం జరిపించేందుకు నిరాకరించడంతో యువకుడు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలోని బరేలి జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని రసూల్పూర్ గ్రామానికి చెందిన శ్రీపాల్ (28)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతితో సన్నిహితంగా మెలిగే నిందితుడు శ్రీపాల్ అదే గ్రామంలోని ఆమె ఇంటికి తరచూ వస్తుండేవాడు.
యువతి తండ్రి వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు. బాధితుడి కూతురిని తనకిచ్చి పెండ్లిచేయాలని నిందితుడు శనివారం కోరగా అందుకు ఆయన నిరాకరించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో నిందితుడు కర్రతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని బరేలీ రూరల్ ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు.