శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 24, 2020 , 18:02:13

మళ్లీ బాంబే హైకోర్టుకు వెళ్లనున్న కంగన.. ఎందుకంటే?

మళ్లీ బాంబే హైకోర్టుకు వెళ్లనున్న కంగన.. ఎందుకంటే?

ముంబై: బాలీవుడ్‌ కథా నాయిక కంగన రనౌత్‌ త్వరలో బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు. ముంబైలో తన ఇంటి కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానిక (దిందోషి) న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయాన్నికంగన తరఫు న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధిఖీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘తాత్కాలిక రక్షణ కల్పించాలని డీబీ బ్రీజ్‌ బిల్డింగ్‌లోని ఇతర నివాసులతో కలిసి నా క్లయింట్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను దిందోషి కోర్టు కొట్టేసింది. ఈ అంశంపై బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు.

దిందోషి సివిల్‌ కోర్టు కొట్టివేసిన తమ పిటిషన్‌పై స్పందించడానికి కంగన రనౌత్‌ గానీ, ఆమె తరఫు న్యాయవాది గానీ అందుబాటులో లేరు. ఖర్‌ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో చట్టవిరుద్ధంగా ఐదో అంతస్తు అపార్ట్‌మెంట్‌ నిర్మించారని ఆరోపిస్తూ కంగన రనౌత్‌కు 2018లోనే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) నోటీసు జారీ చేసింది. దీన్ని ఆమె గతేడాది సవాల్‌ చేశారు. ఇటీవల బాంబేలోని తన కార్యాలయాన్ని కూల్చినప్పుడు బీఎంసీకి వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి విజయం సాధించారు. అలాగే తన ఇంటిని కాపాడుకోవాలని కంగన రనౌత్‌ నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌ నెలలో కంగనా రనౌత్‌, అధికార శివసేన నేతల మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo