బుధవారం 28 అక్టోబర్ 2020
National - Apr 13, 2020 , 12:46:18

కేరళ పోలీసుల మ్యూజిక్ వీడియోకు కమల్ శభాష్

కేరళ పోలీసుల మ్యూజిక్ వీడియోకు కమల్ శభాష్

హైదరాబాద్: లాఠీలు తిప్పే పోలీసులు పాట అందుకున్నారు. పాటకు ఆట జోడించి మ్యూజిక్ వీడియో రూపొందించారు. సకలకళా వల్లభన్ కమల్ హాసన్ మెచ్చుకోళ్లు అందుకున్నారు. మడమ తిప్పము..  కరోనాకు వెన్ను చూపము అనే పాటతో కేరళ పోలీసులు రూపొందించిన మ్యూజికల్ వీడియో జనాదరణ పొందింది. అది తనకు కూడా ఎంతో నచ్చిందని కమలహాసన్ మెచ్చుకున్నారు.

కరోనాపై పోరులో డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ముందున్నారని  కమలహాసన్ అన్నారు. తమ విధులు నిర్వర్తిస్తూనే ఈ అద్భుతమైన వీడియో రూపొందించినందుకు కేరళ పోలీసులకు శభాష్ చెప్పారు. మూడున్నర నిమిషాల ఆ వీడియో కోచ్చి ఏరియల్ షాట్ తో మొదలవుతుంది. అలా అలా నగరంలోని ల్యాండ్‌మార్కుల మీదుగా పోలీసు పటాలంపైకి వెళుతుంది. మాస్కులు, ఇతర వ్యక్తిగత భద్రతా పరికరాలు ధరించి పోలీసులు ఉత్తేజకరమైన పాట నేపథ్యంలో కవాతు చేస్తూ కరోనాపైకి కదం తొక్కుతుంటారు. వెనకాల నాలుగు ప్యాట్రోలింగ్ వాహనాలు అనుసరిస్తుంటాయి. కమల్ ప్రశంసలను సైతం కేరళ పోలీసులు తమ ట్విట్టర్‌లో పెట్టారు.
logo