శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 12:15:35

బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాధిత్య సింధియా

బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాధిత్య సింధియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిన్న సాయంత్రమే సింధియా బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ ఆయన బీజేపీలో చేరారు.

సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం విదితమే. రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మంగళవారం పంపించారు. తన తండ్రి మాధవరావు సింధియా జయంతిరోజే ఆయన కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో 18 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు. మరోవైపు బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు 22 మంది సైతం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. 


logo