బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 15:23:00

కమల్‌నాథ్‌కు గండం

కమల్‌నాథ్‌కు గండం
  • మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ముసలం.. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు!
  • 20 మంది మంత్రులు రాజీనామా
  • సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకొనే దిశగా బీజేపీ
  • 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అదృశ్యం.. వీరిలో ఆరుగురు మంత్రులు
  • బెంగళూరుకు తరలింపు.. ఫోన్లు స్విచ్చాఫ్‌
  • సీఎం కమల్‌నాథ్‌ అత్యవసర క్యాబినెట్‌ సమావేశం

భోపాల్‌, మార్చి 9మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ముసలం పుట్టింది. అధికార కాంగ్రెస్‌లోని జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశారు. దాదాపు 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోమవారం అదృశ్యమయ్యారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దినదినగండంగా కొనసాగుతుండగా.. తాజా పరిణామాలతో కమల్‌నాథ్‌కు పదవీ గండం పొంచి ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. మరోవైపు, ఇటీవల సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కనిపించకుండా పోయిన పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తిరిగిరాగా.. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నది. 


మొత్తం 20 మంది?

కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుకు ప్రయాణమయ్యారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులే. తిరుగుబాటు వర్గంలో వైద్యశాఖ మంత్రి తులసి సిలావత్‌, కార్మికశాఖ మంత్రి మహేంద్రసింగ్‌ సిసోడియా, రవాణాశాఖ మంత్రి గోవింద్‌సింగ్‌ రాజ్‌పుత్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఇమార్తిదేవి, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తోమర్‌, పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రభుర చౌదరి ఉన్నట్టు తెలిసింది. వారందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. సోమవారం అర్థరాత్రికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్‌ క్యాంప్‌నకు చేరుతారని చెప్తున్నారు. తమవద్ద 20 మంది ఎమ్మెల్యేలున్నారని సింధియా వర్గం చెప్తుండగా, కాంగ్రె స్‌ మాత్రం తొమ్మిది మందేనని వాదిస్తున్నది. 


క్యాబినెట్‌ మంత్రుల రాజీనామా

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సోమవారం ఉదయం ఢిల్లీలో సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అయితే సింధియా వర్గం ఎదురుతిరుగడంతో ఆగమేఘాల మీద భోపాల్‌కు చేరుకున్నారు. రాష్ర్టానికి వచ్చిన వెంటనే పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం కమల్‌నాథ్‌ తన నివాసంలో అత్యవసర క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు సమాలోచనలు జరిపారు. క్యాబినెట్‌ సమావేశానికి హాజరైన 20 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారని మంత్రి ఉమంగ్‌ సెంగార్‌ తెలిపారు. క్యాబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని సీఎంను కోరామన్నారు. సింధియా ఇప్పటికీ కాంగ్రెస్‌తోనే ఉన్నారని, కచ్చితంగా ఐదేండ్లు పాలిస్తామని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం కానున్నట్టు తెలిపారు. 


ఢిల్లీలో ప్రత్యక్షమైన సింధియా 

జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన సోమవారం రాత్రి ప్రధాని మోదీ, అమిత్‌షాతో సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే భేటీ జరుగలేదని సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం సింధియాను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నది. 

గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ప్రస్తుతం లక్నోలో ఉన్నారు. మంగళవారం భోపాల్‌కు వస్తారు. 

స్వతంత్ర ఎమ్మెల్యే సురేంధర్‌ శెరా తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్‌ నేతలు హామీఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీని మరిచిపోయారని విమర్శించారు. 


పావులు కదుపుతున్న బీజేపీ 

అధికార పార్టీలో మొదలైన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తున్నది. బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులను వివరించారు.  బీజేపీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కలుస్తారని సమాచారం.


సీఎం పదవి దక్కక సింధియా అసంతృప్తి 

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌కు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కొంతకాలంగా పొసగడం లేదు. మధ్యప్రదేశ్‌లో 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం పదవి కోసం కమల్‌నాథ్‌, సింధియా పోటీపడ్డారు. అయితే సింధియాకు 23 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో సీఎం కుర్చీ దక్కలేదు. అప్పటి నుంచి సింధియా అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతోపాటు ఆయనకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఆయన మద్దతుదారులను ఎదుగనీయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింధియా తరుచూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చకుంటే రోడ్లపైకి వచ్చి పోరాడతానని ఇటీవల సింధియా ప్రకటించారు.


బీజేపీ ఆఫర్‌ ఇదీ.. 

సింధియాను రాజ్యసభకు పంపి.. కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని బీజేపీ హామీ ఇస్తున్నట్టు తెలుస్తున్నది


సింధియా డిమాండ్లు..!

పీసీసీ అధ్యక్ష పదవి, రాజ్యసభ సీటు ఇవ్వాలని సింధియా డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. 


మాఫియా సహకారంతో ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి జరుగుతున్న కుట్రలను విజయవంతం కానివ్వను. రాష్ట్ర ప్రజల నమ్మకం, ప్రేమే నా బలం. ఈ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైనది.

-కమల్‌నాథ్‌, సీఎం


ఎప్పుడు ఏం జరిగిందంటే..

మధ్యాహ్నం3 గంటలుకాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతిస్తున్న 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమైనట్టు వార్తలు

సాయంత్రం5.00 రెబల్‌ ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నట్టు సమాచారం

6.55 ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని భోపాల్‌ చేరుకున్న సీఎం కమల్‌నాథ్‌

రాత్రి7.05పార్టీ సీనియర్‌ నేతలు, మంత్రులతో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసిన సీఎం

8.22సింధియా ప్రధాని మోదీతో భేటీ కానున్నట్టు ప్రకటించిన బీజేపీ నేతలు

8.41సింధియా, ఆయన వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీనియర్‌ నేత కరణ్‌ సింగ్‌ను రంగంలోకి దించిన కాంగ్రెస్‌

9.00తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటన

10.23ముఖ్యనేతలతో ముగిసిన కమల్‌నాథ్‌ సమావేశం.. అత్యవసర క్యాబినెట్‌ భేటీకి పిలుపు

11.05మధ్యప్రదేశ్‌ సంక్షోభంలో బీజేపీ పాత్రలేదన్న ఆపార్టీ నేత విశ్వాస్‌ సారంగ్‌

11.12ప్రభుత్వాన్ని అస్థిరపరిచే శక్తులను గెలువనీయబోనన్న కమల్‌నాథ్‌

11.13మంత్రులను రాజీనామా చేయాల్సిందిగా కోరిన సీఎం

11.1520 మంది మంత్రుల రాజీనామా..సీఎం ఆమోదం

11.43బీజేపీ కుతంత్రాల్ని తిప్పికొట్టి, సర్కార్‌ను   నిలబెట్టేందుకే రాజీనామా చేసినట్టు మంత్రుల వెల్లడి

11.43న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి చేరుకున్న ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ

11.56కమల్‌నాథ్‌తో కాంగ్రెస్‌ నాయకుల చర్చలlogo
>>>>>>