సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 01:48:09

సింధియా గుడ్‌బై

సింధియా గుడ్‌బై
 • మధ్యప్రదేశ్‌లో తారస్థాయికి రాజకీయ సంక్షోభం
 • కాంగ్రెస్‌ను వీడిన జ్యోతిరాదిత్య సింధియా
 • కొత్త ప్రయాణం ప్రారంభిస్తానంటూ సోనియాగాంధీకి లేఖ
 • మోదీ, అమిత్‌ షాతో భేటీ.. నేడు బీజేపీలో చేరే అవకాశం
 • సింధియాను బహిష్కరించిన కాంగ్రెస్‌
 • 22 మంది సింధియా అనుకూల ఎమ్మెల్యేలు సైతం రాజీనామా

న్యూఢిల్లీ, మార్చి 10: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కమల్‌నాథ్‌ ప్రభుత్వ మనుగడకే ప్రశ్నార్థకంగామారింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడారు. రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మంగళవారం పంపించారు. తన తండ్రి మాధవరావు సింధియా జయంతిరోజే ఆయన కాంగ్రెస్‌ను వీడారు. పార్టీలో 18 ఏండ్ల ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన బుధవారం బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు బెంగళూరులోని రిసార్ట్‌లో ఉన్న సింధియా అనుకూల వర్గం ఎమ్మెల్యేలు 22 మంది సైతం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇదే అదునుగా అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నది. అయితే తాము బలాన్ని నిరూపించుకుంటామని సీఎం కమల్‌నాథ్‌ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం సీఎల్పీ సమావేశానికి  నలుగురు స్వతంత్రులు సహా సుమారు 100 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని మంత్రి ఒకరు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాంపు రాజకీయానికి తెరలేచింది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌, బీజేపీ రహస్య ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యాయి.  


గంటకుపైగా చర్చలు 

సింధియా మంగళవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసానికి వెళ్లారు. అనంతరం వారిద్దరూ ప్రధాని మోదీ  నివాసానికి చేరుకున్నారు. ముగ్గురూ గంటకుపైగా చర్చలు జరిపారు. సింధియా బీజేపీలో చేరితే ఏయే బాధ్యతలు అప్పగిస్తారో మోదీ, షా వివరించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆయనకు రాజ్యసభ స్థానంతోపాటు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టవచ్చని వెల్లడించాయి. దీంతో సింధియా బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది.  అనంతరం కాంగ్రెస్‌కి సింధియా రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. మరోవైపు మధ్యప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌సింగ్‌ కుశ్వానా, ఎస్పీ ఎమ్మెల్యే రాజేశ్‌ శుక్లా బీజేపీ సీనియర్‌నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో భేటీ అయ్యారు. హోలీ సందర్భంగా వారు గౌరవసూచకంగా మాత్రమే తనను కలిశారని, ఇందులో రాజకీయమేమీ లేదని చౌహాన్‌ తెలిపారు. 


ఏడాది నుంచి అనుకుంటున్నా: సింధియా

పార్టీని ఎందుకు వీడాల్సి వస్తున్నదో సోనియాకు పంపిన రాజీనామా లేఖలో సింధియా వివరించారు. ‘18 ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి నిబద్ధతతో సేవలందించా. నేను పార్టీని వీడాలని ఏడాదిగా అనుకుంటున్నా. ప్రజలకు, మధ్యప్రదేశ్‌కు, దేశానికి సేవచేయాలన్నదే నా అభిమతం. కాంగ్రెస్‌లో ఉంటే నా లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోలేనని స్పష్టమైంది. సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. అందుకే పార్టీలో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని సింధియా పేర్కొన్నారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన సోనియాకి, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. 


గవర్నర్‌కు రాజీనామా లేఖలు

సింధియా రాజీనామా అనంతరం.. ఆయన వర్గం ఎమ్మెల్యేలు  22 మంది తమ రాజీనామా లేఖలను గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు సమర్పించారు. మరోవైపు సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులను తొలిగించాలంటూ సీఎం కమల్‌నాథ్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. కాగా, బీజేపీ నేత భూపేంద్ర సింగ్‌ నేతృత్వంలోని బృందం స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతిని కలిసింది. బెంగళూరులోని 19 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను ఆయనకు అందజేసింది. మిగతా ముగ్గురు నేరుగా అందించారు. 


పైలట్‌ విఫల యత్నం

సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది. రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ నేతృత్వంలోని బృందాన్ని ఆయన వద్దకు పంపింది. అయితే వారిని కలిసేందుకు సింధియా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొంతసేపటికే సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.


కమల్‌నాథ్‌ ముందున్న మార్గాలు.. 

 • ‘సింధియా సంక్షోభం’తో విలవిలలాడుతున్న ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ముందు ఇప్పుడు మూడు దారులు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. 
 • అసెంబ్లీని రద్దుచేస్తూ కమల్‌నాథ్‌ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సిఫారసుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేస్తే  మళ్లీ ఎన్నికలకు వెళ్లడం అనివార్యం అవుతుంది.  
 • 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. ముందే కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేసే అవకాశం. 
 • గవర్నర్‌ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కోరితే.. కమల్‌నాథ్‌ విశ్వాస పరీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే.. సింధియా వర్గంలో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు. గవర్నర్‌, స్పీకర్‌ కీలకం

 • మధ్యప్రదేశ్‌లో జరుగనున్న తదుపరి పరిణామాల్లో గవర్నర్‌, స్పీకర్‌ పాత్ర కీలకం కానున్నారని నిపుణులు చెప్తున్నారు. 
 • బీజేపీ విన్నపం మేరకు గవర్నర్‌.. ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్ష కోరవచ్చు. 
 • ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కమల్‌నాథ్‌ సిఫారసు చేస్తే.. ఆమోదించడం, తిరస్కరించడం గవర్నర్‌ అభీష్టం. 
 • 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ తిరస్కరించవచ్చు. ఇదే జరిగితే కర్ణాటక తరహా హైడ్రామా జరగొచ్చు.


సింధియా రాజకుటుంబం.. బీజేపీ, కాంగ్రెస్‌ల కలబోత

స్వాతంత్య్రానికి ముందు గ్వాలియర్‌ సంస్థానాన్ని పాలించిన రాజకుటుంబ వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నాయనమ్మ విజయరాజె సింధియా 1957లో కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. గుణ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 1967లో ఆమె జనసంఘ్‌లో (బీజేపీ పూర్వరూపం) చేరారు. 1971లో ఇందిరాగాంధీ హవాను తట్టుకుని జనసంఘ్‌ తరఫున బింద్‌ నుంచి విజయరాజె, గుణ నుంచి విజయరాజె కుమారుడు మాధవరావ్‌ సింధియా గెలుపొందారు. అయితే ఎమర్జెన్సీ అనంతరం 1977లో మాధవరావ్‌ సింధియా తన తల్లిని కాదని కాంగ్రెస్‌లో చేరారు. అదేసమయంలో విజయరాజె కుమార్తెలు వసుంధర రాజె, యశోధర రాజెలు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1984లో వసుంధర రాజె బీజేపీలో చేరారు. యశోధర రాజె మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాధవ్‌రావ్‌ సింధియా 2001లో విమాన ప్రమాదంలో మరణించడంతో ఆయన కుమారుడైన జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.


దూరమైన సన్నిహితుడు

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా  గుర్తింపుపొందిన జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం వెనుక కొన్నాళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో జ్యోతిరాదిత్యది 18 ఏండ్ల ప్రస్థానం. తండ్రి మాధవరావు సింధియా మరణించటంతో 2002లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గుణ లోక్‌సభ స్థానంనుంచి పార్లమెంట్‌కు నాలుగుసార్లు ఎన్నికయ్యారు. అయితే, 2017లో రాహుల్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత.. యువనేతలకు ప్రాధాన్యం కల్పించటంతో జ్యోతిరాదిత్య పేరు ప్రముఖంగా వెలుగులోకొచ్చింది. 2018 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో జ్యోతిరాదిత్య కీలకపాత్ర పోషించినప్పటికీ.. ఆయనకు సీఎం పదవి లభించలేదు.కనీసం, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. పార్టీ అధ్యక్షపదవికి రాహుల్‌ రాజీనామా చేయటంతో.. పార్టీలో యువనేతలకు ప్రాధాన్యం పోయింది. గత కొన్ని నెలలుగా ప్రయత్నించినప్పటికీ రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడం, తాను ఆశించిన రాజ్యసభ సీటుపై పార్టీ ఎలాంటి హామీని ఇవ్వకపోవడంతో జ్యోతిరాదిత్యకు అసంతృప్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తున్నది. logo