గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 12:22:27

కాంగ్రెస్‌కు షాక్‌..ప్రధాని మోదీని కలిసిన సింధియా

కాంగ్రెస్‌కు షాక్‌..ప్రధాని మోదీని కలిసిన సింధియా

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మధ్య అంతర్గత విభేదాలతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడింది. సింధియా బీజేపీలో చేరుతారని..రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి సింధియా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసానికి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు సింధియా బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బతగలనుంది.  సింధియా మద్దతుదారులైన 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్నారు. 

సీఎం పదవి దక్కకపోవడంతో సింధియా అసంతృప్తి 

మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌కు జ్యోతిరాదిత్య సింధియాకు కొంతకాలంగా పొసగడం లేదు. మధ్యప్రదేశ్‌లో 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం పదవి కోసం కమల్‌నాథ్‌, సింధియా పోటీపడ్డారు. అయితే సింధియాకు 23 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో సీఎం కుర్చీ దక్కలేదు. అప్పటి నుంచి సింధియా అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతోపాటు ఆయనకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఆయన మద్దతుదారులను ఎదుగనీయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింధియా తరుచూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చకుంటే రోడ్లపైకి వచ్చి పోరాడతానని ఇటీవల సింధియా ప్రకటించారు.


logo